
నందిపేట్ : సీసీ కెమెరాను ముట్టుకున్నాడు అని విద్యార్థిని ఉపాధ్యాయులు విచక్షణారహితంగా కొట్టిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం నూత్ పల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో జరిగింది. మండలంలోని జీజీ నడుకుడా గ్రామానికి చెందిన రుషేంద్ర గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో పాఠశాలలో ఆడుకుంటూ సీసీ కెమెరాను ముట్టుకున్నాడు. ఈ విషయం పీటి టీచర్ కు తెలిసింది.
దీంతో వ్యాయామటీచర్ శ్రీకాంత్, ఉపాధ్యాయులు శంకర్, నరేష్ సదరు విద్యార్థిని గదిలోకి తీసుకు వెళ్లారు. అక్కడ విచక్షణారహితంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక రుషేంద్ర అస్వస్థతకు గురయ్యాడు. మరుసటి రోజు ఆ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విద్యార్థిని గురుకులం నుంచి ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్యం చేయించారు. విద్యార్థిని పరీక్షించిన వైద్యులు చెవి కర్ణభేరి దెబ్బతిన్నదని, వినికిడిపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ఏడుగురి మృతి.. పదిమందికి గాయాలు..
దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాలలో ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న గురుకుల ఆర్ సిఓ సత్యనాథ్ రెడ్డి పాఠశాలకు చేరుకుని విచారించారు. వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీకాంత్, గణిత ఉపాధ్యాయుడు శంకర్ ను విధుల నుంచి తొలగించాలని, మరో ఉపాధ్యాయుడైన నరేష్ పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపామని తెలిపారు. దీంతో విద్యార్థి కుటుంబీకులు ఆందోళన విరమించారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే మరోటి సెప్టెంబర్ 7న నిజామాబాద్ లోనే వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ లో టీచర్ కొట్టిన దెబ్బలకు ఓ నిండు ప్రాణం బలయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే... పాఠశాలలో ఇచ్చిన హోంవర్క్ చేయకపోవడం అభం శుభం తెలియని ఆ చిన్నారి ఉసురు తీసింది. తాను ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదని ఆగ్రహం తెచ్చుకున్న ఉపాధ్యాయురాలు.. రెండో తరగతి చదువుతున్న బాలికపై తన ప్రతాపం చూపెట్టింది. టీచర్ విచక్షణారహితంగా కొట్టిన దెబ్బలకు ఆ చిన్నారి ఆసుపత్రి పాలైంది. చికిత్స పొందుతూ సెప్టెంబర్ 5న కన్నుమూసింది. నిజామాబాద్లో జరిగిన ఈ ఘటన సెప్టెంబర్ 6న వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్, అర్సపల్లిలోని ఫుట్ బ్రిడ్జ్ పాఠశాలలో మంతాష (7) అలియాస్ ఫాతిమా రెండో తరగతి చదువుతోంది. ఫాతిమా హోం-వర్కు చేయకపోవడంతో సెప్టెంబర్ 2న ఓ టీచర్ విపరీతంగా కొట్టింది. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చాక ఫాతిమా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫాతిమా సెప్టెంబర్ 5న రాత్రి కన్ను మూసింది. ఫాతిమా అంత్యక్రియలను మరుసటి రోజు నిజామాబాదులో పూర్తి చేశారు.
అయితే, ఫాతిమా మరణం గురించి తెలుసుకున్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు పాఠశాలవద్దకు చేరి ఆందోళనకు దిగారు. టీచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, ఫాతిమామరణంతో తమకు సంబంధం లేదని స్కూల్ యాజమాన్యం చెబుతోందని వారు ఆరోపించారు. ఫాతిమా మరణంపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అధికార పార్టీకి చెందిన కొందరు చేసిన ఒత్తిడే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా, చిన్నారి మృతి ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఫుడ్ బ్రిడ్జి పాఠశాలను సీజ్ చేయాలని డీఈఓ ఎన్వీ దుర్గాప్రసాద్ సెప్టెంబర్ 6న రాత్రి ఆదేశాలు జారీ చేశారు.