రేవంత్ కు ఇవ్వబోయి... టిఆర్ఎస్ కు షాక్ (వీడియో)

First Published Jan 9, 2018, 9:37 PM IST
Highlights
  • రేవంత్ మీద పోటీ చేస్తానని రెండు వారాల క్రితం సవాల్
  • నేడు అనూహ్యంగా రేవంత్ తో చేతులు కలిపిన అనూ రెడ్డి
  • కొడంగల్ లో హాట్ టాపిక్
  • జాగ్రత్తగా వాచ్ చేస్తున్న టిఆర్ఎస్

కొడంగల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కొడంగల్ ఉప ఎన్నికలు వస్తాయన్న వాతావరణం నెలకొనడంతో ఇటు రేవంత్ శిబిరం... అటు టిఆర్ఎస్ శిబిరం వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. అసలు ఇప్పటి వరకు రేవంత్ రాజీనామా చేయలేదు.. కాబట్టి ఎన్నికలు వస్తాయా రావా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ.. రెండు వర్గాలు బి అలర్ట్ అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.

 

రేవంత్ అనుచరగణాన్ని పెద్ద ఎత్తున టిఆర్ఎస్ లోకి గుంజుకున్నారు. అధికార పార్టీ నేతలు సీరియస్ గా కేంద్రీకరించారు. మంత్రులు సైతం రంగంలోకి దిగి రేవంత్ కు చెక్ పెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ తీసుకున్న ఒక స్టెప్ రేవంత్ కు అడ్వాన్టేజ్ అయిందని చెబుతున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు.. ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొడంగల్ లో దశాబ్దాల కాలంగా పాతుకుపోయిన గుర్నాథ్ రెడ్డి కుటుంబం అసంతృప్తితో రగిలిపోతున్నది.

ఈ పరిస్థితుల్లో గుర్నాథ్ కుటుంబసభ్యులు కొందరు రేవంత్ తో చేతులు కలిపారు.ఇలా చేతులు కలిపిన వారిలో గుర్నాథ్ రెడ్డి సోదరుడి కుమార్తె ఆనం ఎ రెడ్డి (అనూ రెడ్డి) తోపాటు ఆమె సోదరుడు కూడా ఉన్నారు. అయితే అనూ రెడ్డి గత కొంతకాలంగా కొడంగల్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆమెకు స్థానిక పరిస్థితులు కలిసి రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ అనుకూలంగా జరిగితే రేవంత్ మీద పోటీ చేసి గెలుస్తానని ఆమె సవాల్ చేశారు. రేవంత్ ను ఓడించడమే తన లక్ష్యం అని ప్రకటించారు. ఈ సందేశంతో కూడిన పోస్టు ఒకదాన్ని ఆమె డిసెంబరు 25వ తేదీన ఫేస్ బుక్ లో తన వాల్ మీద పోస్టు చేశారు.

కానీ ఏమైందో.. ఏమో అనూహ్యంగా రెండు వారాలు గడిచేసరికే తొడ కొట్టి సవాల్ చేసిన రేవంత్ తో చేతులు కలిపారు. ఈ నిర్ణయం ఊహించని పరిణామంగా చెబుతున్నారు. అయితే గుర్నాథ్ రెడ్డి విషయంలో టిఆర్ఎస్ వ్యవహరించిన తీరు తట్టుకోలేకే వారు రేవంత్ తో చేతులు కలిపినట్లు చెబుతున్నారు. గత రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి సుదీర్ఘంగా భేటీ అయ్యారు అనూ రెడ్డి.

మరి నిన్నటిదాకా రేవంత్ మీద పోటీ చేస్తానని సవాల్ చేసిన అనూరెడ్డి ఇప్పుడు రేవంత్ తో చేతులు కలపడం మాత్రం కొడంగల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయిందని చెప్పవచ్చు.

click me!