హిజ్రాలే అతని టార్గెట్: నచ్చిన వారిపై లైంగిక దాడి, దోపిడి, హత్య

By Siva KodatiFirst Published Apr 5, 2019, 11:45 AM IST
Highlights

హిజ్రాలపై దాడులకు పాల్పడి వారి నుంచి నగదు, నగలు దోచుకుంటున్న గ్రానైట్ వెంకట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

హిజ్రాలపై దాడులకు పాల్పడి వారి నుంచి నగదు, నగలు దోచుకుంటున్న గ్రానైట్ వెంకట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం, కక్కాలపల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకట్ యాదవ్‌కు 2009లో ఎల్బీ నగర్‌లో దివ్య అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది.

ఇద్దరూ ఏడాది పాటు సహజీవనం చేశారు. అనంతరం వెంకట్‌కు వివాహం జరిగింది. అయితే తనను వదిలి భార్య వద్ద ఉంటున్న వెంకట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన దివ్య.. అతడి గ్రామానికి వెళ్లి గొడవ చేసింది.

తన పరువు తీసి వూళ్లో తలెత్తుకోనీయకుండా చేసిందని దివ్యపై పగబట్టిన వెంకట్‌.. ఆమెను చంపాలని హైదరాబాద్ వచ్చాడు. దివ్య ఆచూకీ తెలుసుకునే క్రమంలో కూకట్‌పల్లిలో ప్రవళ్లిక అనే మరో హిజ్రాను బండరాయితో మోదీ దారుణంగా హత్య చేశాడు.

తన జీవితం ఇలా నాశనం అయిపోవడానికి కారణం హిజ్రాలేనని వారిపై కక్ష పెంచుకుని వారినే లక్ష్యంగా చేసుకుని తరచూ హిజ్రాలపై దాడులకు పాల్పడి నగదు, నగలు దోచుకునేవాడు.

ఈ క్రమంలో బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఇందిరానగర్‌లో మకాం వేసిన అతను గతేడాది ఓ హిజ్రాతో మాట్లాడుతున్న బ్రహ్మం అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను హత్య చేశాడు. గతేడాది సెప్టెంబర్‌ 27న యాస్మినే అనే హిజ్రా ఇంట్లో చొరబడి ఆమెపై దాడి చేసి రూ.2 లక్షల నగదు, బంగారం దోచుకెళ్లాడు.

దీనిపై హిజ్రాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. నాటి నుంచి పరారీలో ఉన్న వెంకట్ వివిధ రాష్ట్రాల్లో మకాం వేశాడు. అతనిపై పక్కా నిఘా వేసిన బంజారాహిల్స్ పోలీసులు రెండు రోజుల క్రితం అనంతపురంలోని ఓ లాడ్జీలో స్నేహితులతో కలిసి పేకాట ఆడుతున్న వెంకట్‌‌ను పట్టుకున్నారు.

విచారణలో అతని దారుణాలు బయటపడ్డాయి. ప్రతినెలా హిజ్రాలు నుంచి మామూళ్లు వసూళ్లు చేయడం, తనకు నచ్చిన హిజ్రాపై లైంగిక దాడులకు పాల్పడటం, హిజ్రాల ఇళ్లలోకి దూరి నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వెంకట్‌పై హైదరాబాద్‌లోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 10 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. 

click me!