
ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేసే వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. డబ్బుల విషయంలో లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకోగా... ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబ్ నగర్ వైష్ణోదేవి కాలనీలో ఉండే నరహరి(40) చిన్నచింతకుంట మండలంలో ఉంద్యాల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఆయన భార్య అరుణకుమారి హన్వాడ మండలంలోని వేపూరిలో జీహెచ్ఎంసీగా విధులు నిర్వహిస్తున్నారు.
నరహరికి రాజేంద్రనగర్ లో ఉండే జగదీశ్ అలియాస్ జగన్ తో రెండేళ్ల క్రితమే పరిచయం ఏర్పడింది. జగదీశ్ స్వస్థలం పెద్దపల్లి జిల్లాలోని మంథని. పదేళ్ల క్రితం ఇక్కడకి వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వారి పరిచయం ఆర్థిక లావాదేవీలకు కారణమైంది.
ఈ క్రమంలోనే రూ.80లక్షల నుంచి రూ.కోటి వరకు నరహరి స్థిరాస్తి వ్యాపారం కోసం జగదీశ్ కు ఇచ్చారు. ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని రెండు నెలల నుంచి నరహరి ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం 6 గంటలకు జగదీశ్ ఇంటికి వెళ్లారు.
అక్కడ వారి మధ్య రాత్రి 12గంటల వరకు వాదోపవాదాలుు జరిగాయి. త్వరలోనే డబ్బులు ఇస్తానని.. లేకపోతే బాలానగర్ లో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని జగదీశ్ హామీ ఇవ్వడంతో.. సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని చెప్పి నరహరి బైక్ పై ఇంటికి బయలు దేరాడు.
ఇంటికి వెళుతున్న నరహరి పై దాడి చేసి మరీ దారుణంగా కొట్టి చంపేశారు. కారుతో ఢీకొట్టి.. మెడ కోసి చంపేశారు. తొలుత.. అందరూ రోడ్డు ప్రమాదం అనుకున్నారు. కానీ.. దర్యాప్తులో హత్య అని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.