
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బాసరలో పర్యటించనున్నారు. బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి.. విద్యార్థులతో భేటీ కానున్నారు. ఇందుకోసం గవర్నర్ తమిళిసై.. ఈ రోజు రాత్రి బాసర బయలుదేరనున్నారు. రాత్రి రైలులో బాసరకు వెళ్లనున్నారు. రేపు ఉదయం బాసర సరస్వతి అమ్మవారిని గవర్నర్ తమిళిసై దర్శించుకోనున్నారు. అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ చేరుకుని.. విద్యార్థులతో మాట్లాడనున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు.. క్యాంపస్ పరిసరాలను పరిశీలించనున్నారు.
ఇదిలా ఉంటే.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత కొంతకాలంగా తమ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారం రోజు పాటు ఆందోళనకు దిగగా.. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హామీ మేరకు నిరసనకు ముగింపు పలికారు. మంత్రి హామీ ఇచ్చినప్పటికీ.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకుండాపోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, ఇటీవల బాసరకు ఐటీకి చెందిన విద్యార్థి ప్రతినిధి బృందం కూడా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసింది. ఈ సందర్భంగా ఆహారం, అడ్మినిస్ట్రేషన్ గురించి సమస్యలను గవర్నర్ దృష్టికి విద్యార్థుల బృందం తీసుకెళ్లింది. ఈ సందర్భంగా బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ పై గవర్నర్ Tamilisai Soundararajan ఆవేదన వ్యక్తం చేశారు.పుడ్ పాయిజన్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని గవర్నర్ చెప్పారు. తాను మీకు ఎంత సపోర్ట్ చేయగలనో అంత మేరకు సపోర్ట్ చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. తాను త్వరలోనే 75 కాలేజీలను సందర్శిస్తానని గవర్నర్ ప్రకటించారు. బాసర ట్రిపుల్ ఐటీని కూడా సందర్శిస్తానన్నారు.