రాజ్‌భవన్ ఏమైనా అంటరాని ప్రాంతామా?.. నిద్ర నటించే వాళ్లను ఏం చేయలేం: గవర్నర్ తమిళిసై

By Sumanth KanukulaFirst Published Sep 8, 2022, 2:17 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వంపై  రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరోక్ష‌ విమర్శలు చేశారు. తనతో రాష్ట్ర ప్రభుత్వానికి  వచ్చిన  ఇబ్బందేమిటని తమిళిసై ప్రశ్నించారు. తన మనో ధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వంపై  రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరోక్ష‌ విమర్శలు చేశారు. తెలంగాణ గవర్నర్‌గా తాను బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తమిళిసై సౌందర్ రాజన్ మాట్లాడారు.  ఏ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లేదని అన్నారు. రాజ్ భవన్ విషయంలో అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్నికైనా ప్రజాప్రతినిధి అందుబాటులో లేకపోతే ప్రజలు ఎవరి దగ్గరకు వెళ్లాని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌లో ఎందుకు అడుగుపెట్టడం లేదని ప్రశ్నించారు. రాజ్ భవన్ ఏమైనా అంటరాని ప్రాంతామా? అంటూ టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు కురిపించారు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు. సమస్యలు ఏవైనా ఉంటే తనతో మాట్లాడొచ్చని చెప్పారు. 

తనతో రాష్ట్ర ప్రభుత్వానికి  వచ్చిన  ఇబ్బందేమిటని తమిళిసై ప్రశ్నించారు. తన మనో ధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని చెప్పారు. సర్వీస్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి కౌశిక్ రెడ్డి కరెక్ట్ కాదనే రిజెక్ట చేశానని చెప్పారు. ఆ విషయంలో నిబంధనల మేరకే వ్యవహరించానని తెలిపారు. తాను ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని చెప్పారు. తాను తెలంగాణ చరిత్ర చదివానని.. సెప్టెంబర్ 17న విమోచన అనే పదమే సరైనదని అన్నారు. 

సదరన్ కౌన్సిల్ సమావేశానికి సీఎం ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. కేంద్రం వివక్ష చూపుతోందని పదే పదే మాట్లాడుతున్న కేసీఆర్.. విభజన సమస్యల పరిష్కారానికి అవకాశం వచ్చినా వినియోగించుకోవడం లేదని చెప్పుకొచ్చారు. నిద్రపోయేవారిని లేపొచ్చని.. కానీ నిద్ర నటించేవారిని ఏం చేయలేం అని అన్నారు. రేపు మరో గవర్నర్ వచ్చినా ఇలానే చేస్తారా అని ప్రశ్నించారు. ఎట్‌హోమ్‌కు వస్తానని రాకపోవడం కరెక్టేనా? చెప్పాలని అడిగారు. 

Also Read: నాకు గౌరవం ఇవ్వకపోతే నేనేమి తక్కువ కాను.. నా పనిని కొనసాగిస్తాను: గవర్నర్ తమిళిసై సంచలన కామెంట్స్

పార్టీలను చూసి తాను అపాయింట్‌మెంట్ ఇవ్వనని చెప్పారు. తాను వివాదస్పద వ్యక్తిని కాదని అన్నారు. అందరికి తాను సమ న్యాయం చేశానని చెప్పారు. గవర్నర్ ఆఫీస్‌పై తీవ్ర వివక్ష చూపిస్తున్నారని అన్నారు. ఈ మూడేళ్లలో గవర్నర్‌పై చూపిన వివక్ష చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. తాను ఎప్పుడూ పరిధి దాటలేదని చెప్పారు. 

సీఎం పనితీరుపై గ్రేడ్ ఇవ్వడానికి తాను చాలా చిన్న వ్యక్తినంటూ కామెంట్ చేశారు. గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారు అనేవారు.. సీఎం రాజకీయాలు చేస్తున్నారని ఎందుకు అడగరని ప్రశ్నించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ తనను దూరం పెట్టారని చెప్పారు. రాష్ట్రంలో రిపబ్లిక్ డే పరేడ్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో గవర్నర్ సందేశం లేకుండా చేశారని అన్నారు. రాష్ట్రంలో గవర్నర్‌కు జరుగుతుంది నిజంగా హర్షించే విషయమేనా అని ప్రశ్నించారు. 

ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్మలమైన మనసుతో ముందుకు సాగుతానని చెప్పారు. సన్మానం జరిగినా జరగకపోయినా తన కృషిలో మార్పు ఉండదని చెప్పారు. మేడారం వెళ్లేందుకు హెలికాప్టర్‌ అడిగిన స్పందించలేదని తమిళిసై అన్నారు. సమ్మక్క- సారక్క జాతరకు వెళ్లేందుకు రోడ్డు మార్గంలో  8 గంటలు ప్రయాణించినట్టుగా చెప్పారు. 

తాను ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని చెప్పారు. కొన్ని విషయాలు బయటకు చెప్పడం మంచిది కాదని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదల కోసం తన పని కొనసాగిస్తుంటానని చెప్పారు. తనకు గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా పట్టించుకోననని.. రాజ్‌భవన్‌ను గౌరవించాలి కదా అని అన్నారు. తనకు ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశాలు లేవని చెప్పారు. తనకు గౌరవం ఇవ్వకపోతే తానేమి తక్కువ కానని.. తన పనిని తాను కొనసాగిస్తానని చెప్పారు. 
 

click me!