"పుస్తెలు తీస్తేనే పరీక్షా".. టీఎస్‌పీఎస్సీపై గవర్నర్ ఆగ్రహం

By Arun Kumar PFirst Published Sep 18, 2018, 10:56 AM IST
Highlights

తెలంగాణ వ్యాప్తంగా వీఆర్వో పోస్టుల భర్తీకి ఆదివారం జరిగిన పరీక్షలో ఓ పరీక్షా కేంద్రంలో మహిళా అభ్యర్థులను పుస్తెలు, మెట్టెలు తీసి రావాలంటూ ఆంక్షలు విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

తెలంగాణ వ్యాప్తంగా వీఆర్వో పోస్టుల భర్తీకి ఆదివారం జరిగిన పరీక్షలో ఓ పరీక్షా కేంద్రంలో మహిళా అభ్యర్థులను పుస్తెలు, మెట్టెలు తీసి రావాలంటూ ఆంక్షలు విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మీడియాలో విస్తృతంగా కథనాలు రావడంతో విషయం రాజ్‌భవన్‌కు చేరింది.

ఈ సంఘటనపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తూనే వివరణ ఇవ్వాల్సిందిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆఘామేఘాల మీద స్పందించిన టీఎస్‌పీఎస్సీ ఒక నివేదికను గవర్నర్ కార్యాలయానికి పంపింది.

ఈ వివాదంపై టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ వాణీప్రసాద్ వివరణ ఇచ్చారు. జరిగిన ఘటనకు ఆయా పరీక్షా కేంద్రాల నిర్వాహకులే బాధ్యులు అవుతారని తెలిపారు. మహిళా అభ్యర్థులు మంగళసూత్రాలు తీసి రావాలనే నిబంధనను తాము విధించలేదని తెలిపారు. పుస్తెలు తీసి రావాలని వార్తలు వచ్చిన వెంటనే తాము స్పందించామని... విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించామన్నారు.

నలుగురైదుగురితో మంగళసూత్రాలు తీయించినట్లు విచారణలో తేలిందని.. ఆ పరీక్షా కేంద్రాన్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టామన్నారు. మరోవైపు మహిళల చేత పుస్తెలు తీసేయించడం హైందవ సంస్కృతిని కించపర్చడమేనని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు.

ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్‌‌లోని వీఆర్వో పరీక్షా కేంద్రంలో అక్కడి నిర్వాహకులు మహిళా అభ్యర్థులను పుస్తెలు, మెట్టెలు తీస్తేనే పరీక్షకు అనుమతిస్తామని చెప్పడంతో.. వారి భర్తలు, బీజేపీ నేతలు పరీక్షా కేంద్రం బయట నిరసన తెలిపారు. 

పుస్తెలు, మెట్టెలు తీయాల్సిందే... వీఆర్వో పరీక్షా కేంద్రాల్లో అధికారుల ఓవర్ యాక్షన్

తాళి,మెట్టెలు తీసేస్తేనే పరీక్షహాల్లోకి...టీఎస్‌పిఎస్సి ఛైర్మన్ కు వీహె‌చ్‌పి ఫిర్యాదు

click me!