గోడలే బ్లాక్ బోర్డ్, గ్రామమే గరీబోళ్ల స్కూలు... కరోనా సమయంలో ఓ టీచరమ్మ వినూత్న బోధన (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 30, 2021, 3:44 PM IST
Highlights

పట్టుదల వుంటే ఎంతటి కష్టతరమైన విద్యనైనా అలవోకగా నేర్చుకోవచ్చని ఆనాడు ఏకలవ్యుడు నిరూపిస్తే.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పవచ్చని పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ టీచరమ్మ నిరూపించారు. 

పెద్దపల్లి: పట్టుదల వుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చిన చరిత్రలో ఏకలవ్యుడు నిరూపించాడు. గురువు లేకుండానే విలువిద్యలో పట్టు సాధించి గురువునే ఆశ్యర్యానికి గురిచేశాడు. అయితే శిష్యలే కాదు గురువులు కూడా వండర్స్ చేయగలరని ఈ టీచరమ్మ నిరూపించారు. లాక్ డౌన్ కారణంగా స్కూళ్లు మూతపడగా ఎలాగయినా విద్యార్థులకు చదువు చెప్పాలని నిర్ణయించుకున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ టీచర్ వినూత్న పద్దతిలో విద్యాబోధన ప్రారంభించి అందరినీ ఔరా అనిపించారు.  

వివరాల్లోకి వెళితే... పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోని పుట్టపల్లి గ్రామంలో టీచర్ గా పనిచేస్తున్నారు భాగ్యలక్ష్మి. ఎస్జీటీ టీచర్ గా పనిచేస్తున్న ఈమె సరికొత్త పద్దతుల్లో చిన్నారులకు విద్యాబుద్దులు నేర్పించేది. అందరు టీచర్లలా కాకుండా తన టీచింగ్ వృత్తిని అంకితభావంతో చేసేది.  

అయితే గతేడాది కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లతో పాటే పుట్టపల్లి పాఠశాల కూడా మూతపడ్డాయి. సంవత్సరం గడుస్తున్నా స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితులు లేవు. ఇక చిన్నారులను తల్లిదండ్రులే స్కూళ్లకు పంపించడానికి సుముఖంగా లేరు. ఇలాగయితే పిల్లల భవిష్యత్ దెబ్బతింటుందని భావించిన టీచరమ్మ వినూత్న పద్దతిలో విద్యనే విలేజ్ మధ్యకు తీసుకెళ్లింది.  

వీడియో

పుట్టపల్లి గ్రామంలోని ప్రభుత్వం భవనాలు, ఇళ్ల గోడలకు అక్షరాలు, అంకెలను, పద్యాలు, ఇంగ్లీష్ పదాలు ఇలా పుస్తకాల్లో వుండే ప్రతి ఒక్కటి పెయింటింగ్ చేశారు. ఇలా గోడలనే బ్లాక్ బోర్డుగా మార్చి గ్రామం మొత్తాన్ని పాఠశాలగా తీర్చిదిద్దారు. దీంతో పాఠశాలకు వెళ్లకున్నా ఇంట్లోంచి బయటకు వస్తే చాలు విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్నారు. 

ఇలా విద్యార్థుల కోసం ఎంతో కష్టపడుతూ టీచర్ అంటే ఇలా వుండాలనేలా ఆదర్శంగా నిలిచారు భాగ్యలక్ష్మి. ఈ టీచరమ్మ ఆలోచనను గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. కొవిడ్‌ కారణంగా విద్యార్థులు పాఠశాలకు దూరమయ్యారని... వారు ఎక్కువకాలం చదువుకు దూరం కావద్దన్న ఆలోచన నుండే గోడలనే బ్లాక్ బోర్డుగా మార్చి నిత్యం పాఠాలు చెప్పాలన్న ఆలోచన పుట్టిందని ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి తెలిపారు. 

click me!