
Telangana Governor Tamilisai Soundararajan: వీధి కుక్కల దాడిలో నాలుగేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో బాధించిందని తెలిపారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం అధికార యంత్రాంగం చేపడుతున్న ముందస్తు చర్యలు సరిపోవడం లేదనీ, మరింత మెరుగ్గా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో పనిచేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అంతకుముందు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ నగరంలోని అంబర్ పేట వీధికుక్కల దాడిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. తనను ఎంతో బాధించిందని తెలిపారు. వీధి కుక్కల బెడదను ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లు సరిపోవని ఈ సంఘటన రుజువు చేస్తున్నందున అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.
'ఈ విషాదకర ఘటన చూసి బాధపడ్డాను. ఇలాంటి బాధాకరమైన సంఘటనలు మాత్రమే శాశ్వత పరిష్కారాల అవసరాన్ని మనకు గుర్తు చేయకూడదు. అధికార యంత్రాంగం కొన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఈ విపత్తును ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లు సరిపోవని ఈ ఘటన రుజువు చేస్తోంది. నో వర్డ్స్ 2 కన్సోల్' అంటూ ట్వీట్ చేశారు.
కుక్కల దాడిలో బాలుడు మృతి..
అంబర్ పేట ప్రాంతంలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ప్రదీప్ అనే బాలుడు ఆ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నగంగాధర్ కుమారుడు. గంగాధర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఇంధల్వాయి వారి స్వస్థలం. అయితే, ఉపాధి నిమిత్తం హైద్రాబాద్ కు వచ్చారు. ఈ అంబర్ పేటలో నివాసం ఉంటూ.. కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. గంగాధర్ కు ఇద్దరు పిల్లలు. ఆరేళ్ల వయస్సున్న కూతురు, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్ ఉన్నారు. ఆదివారం నాడు ఇద్దరు పిల్లలను తాను పనిచేసే కారు సర్వీసింగ్ సెంటర్ వద్దకు వచ్చారు. అయితే, ఆడుకుంటూ ప్రదీప్ తన సోదరి వద్దకు వెళ్లే సమయంలో వీధి కుక్కలు దాడి చేశాయి.
దాడి జరిగిన తర్వాత కొందరు స్థానికులు హుటాహుటిన ప్రదీప్ ను రక్షించి గంగాధర్ తో కలిసి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రదీప్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో పనిచేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. "మా మున్సిపాలిటీల్లో వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. యానిమల్ కేర్ సెంటర్లు, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మా వంతు కృషి చేస్తాం" అని కేటీఆర్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.
గత ఏడాది నోయిడాలోని ఓ అపార్ట్ మెంట్ లో ఓ పసికందును వీధికుక్క దాడిచేసి ప్రాణాలు తీసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.