కరోనా పరీక్షలు: తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నది ఇదీ...

By Sree sFirst Published May 15, 2020, 10:48 AM IST
Highlights

కరోనా లక్షణాలు లేవు, కాబట్టి కరోనా పరీక్షలు చేయము అని ప్రభుత్వఆసుపత్రి పంపించివేసిన ఒక 30 ఏళ్ల టెక్కీ, ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే... అక్కడ కరోనా పాజిటివ్ గా తేలిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

తెలంగాణాలో కరోనా వైరస్ టెస్టులను తక్కువగా నిర్వహిస్తున్నారన్న అపవాదు ఎప్పటి నుండో కూడా ఉంది. తాజాగా శవాలకు కూడా ఈ పరీక్షలను నిర్వహించాలని హై కోర్ట్ ఆదేశించిన విషయం తెలిసిందే. 

తొలుత విదేశాలకు వెళ్లి వచ్చిన వారు, మర్కజ్ నుంచి వచ్చినవారు, వారి ప్రైమరీ కాంటాక్టులకు మాత్రమే పరీక్షలను నిర్వహించేవారు. తనకు లక్షణాలున్నాయి మొర్రో అని ఒక జర్నలిస్టు మొత్తుకుంటున్నా తనకు పరీక్షలు చేయకుండా తిప్పి పంపించడం, అలాంటి ఉదంతాలు చాలా నమోదవుతుండటం అన్ని వెరసి ఫ్లూ లాంటి లక్షణాలున్న వారికి కూడా టెస్టులను చేస్తుంది ప్రభుత్వం. 

అయితే... తెలంగాణాలో తాజాగా జరిగిన ఒక సంఘటన నివ్వెరపోయేలా చేస్తుంది. కరోనా లక్షణాలు లేవు, కాబట్టి కరోనా పరీక్షలు చేయము అని ప్రభుత్వఆసుపత్రి పంపించివేసిన ఒక 30 ఏళ్ల టెక్కీ, ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే... అక్కడ కరోనా పాజిటివ్ గా తేలిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకివెళితే...  మెహిదీపట్నం ప్రాంతంలోని ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్  ఛాతిలో ఇబ్బందిగా ఉందని తొలుత బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఎటువంటి కరోనా లక్షణాలు బయటకు కనబడనప్పటికీ... అక్కడి డాక్టర్లు అతనికి కరోనా ఏమో అని అనుమానం వ్యక్తం చేసారు. 

దానితో అతడు  ఫీవర్ ఆసుపత్రికి వెళ్ళాడు. తనకు కరోనా అని అనుమానంగా ఉందని చెప్పాడు. కానీ అతడికి లక్షణాలు లేనందున టెస్టు అవసరం లేదని చెప్పి గ్యాస్ అని భావిస్తూ దాని మందులను రాసి పంపించివేశారు.  

కానీ అతడికి ఇబ్బంది ఎక్కువవుతూ ఉండడంతో మరలా కేర్ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ వైద్యులు అతనిని ఐసొలేషన్ వార్డుకి తరలించారు. వారు ఛాతికి సంబంధించిన హై రెసొల్యూషన్ సిటీ స్కాన్ చేసారు. అందులో వారికి కరోనా లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. దానితో అతడి సాంపిల్స్ ని టెస్టులకు పంపించారు. 

అదే రోజు అతడి రిజల్ట్స్ కూడా వచ్చాయి. అందులో అతడు కరోనా పాజిటివ్ గా తేలాడు. మే 14వ తేదీన అతడిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అతడికి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. బయట ఏ కరోనా వైరస్ పేషెంట్ ని కూడా కలవలేదు. ఈ లాక్ డౌన్ ప్రారంభమయినప్పటినుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఇంటి నుంచే పని చేస్తున్నాడు. 

కేవలం కూరగాయలు, ఇతర నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వెళ్ళాడు తప్ప, ఏ ఇతర పనికి కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళలేదు. అతనికి ఈ వైరస్ ఎలా సోకిందో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

అతడి కుటుంబసభ్యులందరికి కూడా పరీక్షలను నిర్వహించారు. సోదరి, బావ, తల్లి నుండి కూడా సాంపిల్స్ ని సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం పంపించారు. ఫలితాలు రావలిసి ఉంది.  

అసలే కరోనా వైరస్ ఉన్నప్పటికీ... లక్షణాలు కనబడడంలేదు అని ప్రపంచదేశాలు కోడై కూస్తున్న వేళ.... కనీసం నన్ను టెస్ట్ చేయండి, డాక్టర్లు అనుమానం వెలిబుచ్చారు అని చెప్పినప్పటికీ... టెస్టులను నిర్వహించకపోవడం నిజంగా శోచనీయం. 

click me!