బాగా పనిచేస్తున్నారు.. మంత్రి తలసానిపై రాజాసింగ్ ప్రశంసల వర్షం

Siva Kodati |  
Published : May 12, 2023, 04:21 PM IST
బాగా పనిచేస్తున్నారు.. మంత్రి తలసానిపై రాజాసింగ్ ప్రశంసల వర్షం

సారాంశం

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. మంత్రి తలసాని బాగా పనిచేస్తున్నారని కొనియాడారు

దక్షిణాదిలో కర్ణాటక తర్వాత అధికారంలోకి రావడానికి అత్యంత అనువుగా వున్న ప్రాంతం కావడంతో తెలంగాణపై బీజేపీ పెద్దలు ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయాలతో బీజేపీ ఫుల్ స్వింగ్‌లో వుంది. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి అధికార పార్టీ సైతం ధీటుగానే బదులిస్తోంది. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య రాజకీయం ఉప్పునిప్పులా వుంది. ఇక బీజేపీ బహిష్కృత నేత, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి సరేసరి. వీలు చిక్కినప్పుడల్లా ఆయన బీఆర్ఎస్‌పై మండిపడుతూనే వుంటారు. 

అలాంటిది బీఆర్ఎస్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై రాజాసింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. వివరాల్లోకి వెళితే.. గోషామహల్‌లోని ముర్లిధరబాగ్‌లో ప్రభుత్వం నిర్మించిన 120 డబుల్ బెడ్ రూం ఇళ్లను శుక్రవారం మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ఎమ్మెల్యే రాజాసింగ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. మంత్రి తలసాని బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. కాస్త ఆలస్యమైనా ప్రజలకు డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చారని.. అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతున్నారని రాజాసింగ్ మంత్రిని ప్రశంసించారు. ఇక్కడి స్థానికుల్లో మరికొందరు కూడా ఇళ్లు అడుగుతున్నారని వారికి కూడా ఇళ్లు ఇవ్వాలని రాజాసింగ్ కోరారు. 

Also Read: డబుల్ బెడ్ రూం ఇళ్లను అమ్ముకోవద్దు.. ఒక్కోటి రూ.కోటిపైనే : లబ్ధిదారులకు మంత్రి తలసాని హితవు

తలసాని మాట్లాడుతూ.. ఇలాంటి ఇల్లు జీవితంలో వస్తుందని జనం ఊహించి వుండరని అన్నారు. ఇక్కడి స్థానికులు పళ్లు, పువ్వులు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారని.. మీ పిల్లలను బాగా చదివించాలని తలసాని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం మార్చివేసిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఒక్కో డబుల్ బెడ్ రూం ఇల్లు కోటి రూపాయలు వుంటుందని, అందువల్ల ఎవ్వరూ ఇల్లు అమ్ముకోవద్దన్నారు. పెన్షన్ అందని వారికి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తలసాని స్పష్టం చేశారు. ఇక్కడ కట్టిన దుకాణాలను స్థానికులకే ఇస్తామని, లాటరీ పద్ధతిలో దుకాణాలు అందిస్తామన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం