
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. ఈ విషయం నల్ల కుబేరులకు బాగానే తెలుసు. అందుకే అలా ప్రధాని మోదీ రూ. 500, రూ.1000 నోట్లు రద్దు చేయగానే తమ బుర్రకు పనిచెప్పారు. బ్లాక్ మనీని బయటకు తెచ్చేందుకు కొత్త రూట్ కనిపెట్టారు.
పెద్ద నోట్లను బంగారంగా మార్చేందుకు జ్యూవెలరీ షాపులకు క్యూ కడుతున్నారు. దీంతో బంగారు దుకాణాల యజమానులు ఇదే మంచి సమయం అంటూ అమాంతంగా రేట్లు పెంచేశారు. నిన్న రాత్రి వరకు 10 గ్రాముల పసిడి ధర రూ.31 వేలుగా ఉంటే .. ఇప్పుడది రూ.40వేలకు పెరిగింది. హైదరాబాద్ పాతబస్తీ సహా నగరంలోని పలు చోట్ల బంగారు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, అక్రమార్కులు మరో రకంగా ఆలోచిస్తున్నారు. నల్ల కుబేరులు తమ వద్ద ఎంత అక్రమార్జన ఉంటే అంత వదిలించుకునేందుకు చూస్తున్నారు. ముఖ్యంగా రూ.500, రూ.1000 నోట్లను ఎక్కడికక్కడ వదిలించుకునేందుకు చూస్తున్నారు. ఇందుకు బంగారం వ్యాపారులను సంప్రదిస్తున్నారు. పసిడి ధర ఎంత పెరిగినానల్ల ధనం వదిలించుకునేందుకు కొనడానికి వెనకడుగు వేయడం లేదు.