తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ఐదుగురు మృతి.. గోదావరికి వరద ఉధృతి.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

By Sumanth KanukulaFirst Published Sep 13, 2022, 10:24 AM IST
Highlights

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. 

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. భారీ వర్షాల కారణంగా మృతిచెందిన వారి వివరాలను చూస్తే.. వేములవాడలోని ఫజల్‌నగర్‌లోని కల్వర్టు వద్ద గంగ (47), ఆమె రెండేళ్ల మనవడు కన్నయ్య కొట్టుకుపోయారు. వారు కారులో హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో కల్వర్టు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే వెంటనే స్పందించిన స్థానికులు.. కారులో ఉన్న గంగ బంధువు సతీష్, డ్రైవర్‌ రిజ్వాన్‌లను రక్షించారు. 

ఇక, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎక్బాల్ పూర్ వద్ద భారీ వృక్షం.. రోడ్డుపై వెళ్తున్న కారుపై పడింది. భారీ చెట్టు కూలడంతో వాహనం డ్రైవర్ రాజం, రవి మృతిచెందారు. వాహనంలో ప్రయాణిస్తున్న నిఖిల్‌కు గాయాలు అయ్యాయి. వీరు జగిత్యాల నుంచి ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన ఉడుత మనోజ్ (22) ఆదివారం సెల్ఫీ తీసుకుంటూ నల్గొండలోని డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో పడి మృతి చెందాడు. దీంతో అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతరం అతని మృతదేహాన్ని డిండి ప్రాజెక్టు నుంచి వెలికి తీశారు. ఇక, మనోజ్ తన స్నేహితులతో కలిసి ప్రాజెక్ట్ సైట్‌కి వెళ్లాడు. 

మరోవైపు.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని కొలనుపాక వద్ద వరదల్లో కొట్టుకుపోయిన దంపతులను పోలీసులు, స్థానికులు రక్షించారు. దంపతులు బైక్‌పై వెళ్తుండగా కల్వర్టు వద్ద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే స్థానికులు, పోలీసుల సాయంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. ఇక, అలేరుకు వెళ్తుండగా ఓ వాహనదారుడు బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. అయితే క్రేన్ సాయంతో పోలీసులు అతడిని రక్షించారు. యువకులను రక్షించడంలో సత్వర చర్య తీసుకున్న క్రేన్ డ్రైవర్ మహమ్మద్ హుస్సేన్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అభినందించారు.

గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి..
గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద సోమవారం సాయంత్రం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 45.10 అడుగులకు చేరుకుంది. ఇక, మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం.. 50.20 అడుగులకు చేరింది. వరద ప్రవాహం 48 అడుగులకు చేరగానే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరిలో 12,65,653 క్యూసెక్కుల ప్రభావం కొనసాగుతుంది. గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

click me!