తెలంగాణ అసెంబ్లీలో బీజేపీని కార్నర్ చేసిన టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం..

By Sumanth KanukulaFirst Published Sep 13, 2022, 9:42 AM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు.. బీజేపీని కార్నర్ చేశాయి. అసెంబ్లీలో సోమవారం కేంద్రం విద్యుత్ సంస్కరణలు- పర్యవసానాలు అంశంపై చర్చ సాగింది. ఈ చర్చ సందర్భంగా అధికార టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, ఎంఐఎంలు బీజేపీని ఇరుకునపెట్టాయి.

తెలంగాణ అసెంబ్లీ‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు.. బీజేపీని కార్నర్ చేశాయి. అసెంబ్లీలో సోమవారం కేంద్రం విద్యుత్ సంస్కరణలు- పర్యవసానాలు అంశంపై చర్చ సాగింది. ఈ చర్చ సందర్భంగా అధికార టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, ఎంఐఎంలు బీజేపీని ఇరుకునపెట్టాయి. విద్యుత్ సంస్కరణలను అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలవంతం చేస్తుందని మూడు పార్టీలు మండిపడ్డాయి. ఈ క్రమంలోనే బీజేపీపై విమర్శల వర్షం గుప్పించాయి. దీంతో అసెంబ్లీలో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. 

అసెంబ్లీలో బీజేపీకి ముగ్గురు సభ్యులు ఉండగా.. ఎమ్మెల్యే రాజాసింగ్‌‌పై పీడీ యాక్ట్ నమోదు కావడంతో ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో.. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం సభకు హాజరుకాలేదు. దీంతో బీజేపీ నుంచి ఒక్క రఘునందన్ రావు మాత్రమే సోమవారం శాసనసభలో ఉన్నారు. ఇక, సభలో రఘునందన్ రావు మాట్లాడేందుకు ఆరు నిమిషాల సమయం కేటాయించగా.. ఆయన నాలుగు నిమిషాలు కూడా మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోయింది. అధికార పార్టీ సభ్యుల నుంచి అంతరాయాల కారణంగా ఆయన రెండు నిమిషాల పాటు మాట్లాడే సమయంలో కోల్పోవాల్సి వచ్చింది.  

అయితే తాను మాట్లాడిన సమయంలో రఘునందన్ రావు.. కేంద్ర విద్యుత్ సంస్కరణ‌లను గట్టిగా సమర్ధించే ప్రయత్నం చేశారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రాయితీలను తొలగించాలని రాష్ట్రాలను కేంద్రం కోరిందన్న టీఆర్‌ఎస్ సభ్యుల వాదనకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు.. రైతులు, పేద వర్గాలకు సబ్సిడీలను తొలగించడం గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా రాయితీలను పొడిగించవచ్చని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నా సబ్సిడీలు ఎత్తివేయాలని బిల్లులో ఎక్కడా లేదు’’ అని రఘునందన్ రావు అన్నారు. బిల్లులో ఆ పదాలు ఉండే సీఎం వాటిని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. 

అనంతరం అదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయ, విద్యుత్ రంగాలను వ్యాపారులకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆరోపించారు. దుర్మార్గ పద్దతిలో కేంద్రంలోని బీజేపీ పాలన సాగిస్తుందని మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణలపై అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించిన కేసీఆర్.. రఘునందన్‌రావు పేరును పలుమార్లు ప్రస్తావించారు. రఘునందన్ రావు అబద్దాలు చెబుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 

అంతకు ముందు సభలో ఇదే అంశంపై మాట్లాడిన కాంగ్రెస్‌, ఎంఐఎంలు కూడా బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభలో అరగంటకు పైగా మాట్లాడిన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.. విద్యుత్ సంస్కరణలపై బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్‌పై కేంద్రం పెత్తనం ఏమిటని ప్శ్నించారు. ఉచిత  కరెంట్ వద్దని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామని అనడానికి వాళ్లెవరని ప్రశ్నించారు. ఇక, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా కూడా.. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలపై, విద్యుత్ సంస్కరణలను అమలు చేయనందుకు తెలంగాణ ప్రభుత్వం రుణాలను కేంద్రం తగ్గించిందని మండిపడ్డారు. 

అయితే ఈ సమయంలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరడం ద్వారా సభలోని అన్ని పార్టీల దాడిని ఎదుర్కొనేందుకు రఘునందన్‌రావు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. 

click me!