ఆగస్టు 3న గోదావరి రివర్ బోర్డ్ సమన్వయ కమిటీ భేటీ.. గెజిట్ తర్వాత తొలి సమావేశం

By Siva KodatiFirst Published Jul 30, 2021, 9:56 PM IST
Highlights

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ గెజిట్‌ జారీ చేసిన తర్వాత తొలిసారిగా గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమన్వయ కమిటీ భేటీ కానుంది. గెజిట్‌ అమలు కార్యాచరణ ఖరారుపై సమావేశంలో చర్చించే అవకాశం వుంది. 

తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం నేపథ్యంలో ఆగస్టు 3న గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమన్వయ కమిటీ భేటీ కానుంది. హైదరాబాద్‌ జలసౌధలో ఈ సమన్వయ కమిటీ తొలిసారిగా సమావేశం కానుంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ గెజిట్‌ జారీ చేసిన తర్వాత మొదటిసారి కమిటీ భేటీ అవుతుండటం విశేషం. గెజిట్‌ అమలు కార్యాచరణ ఖరారుపై సమావేశంలో చర్చించే అవకాశం వుంది. ఈ భేటీకి గోదావరి బోర్డు సభ్యులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, జెన్‌కో, ట్రాన్స్‌కో ఎండీలు హాజరుకానున్నారు.

కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదానికి కేంద్రం పుల్ స్టాప్ పెట్టే దిశగా అడుగులు వేసింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులన్నీ ఇక నుండి ఆయా బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. ఈ మేరకు జూలై 15న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ గెజిట్ నోటిఫికేషన్ ఈ ఏడాది  అక్టోబర్ 14 నుండి అమల్లోకి రానుందని కేంద్రం స్పష్టం చేసింది.

Latest Videos

ఒక్కో రాష్ట్రం బోర్డుల నిర్వహణ కోసం రూ. 200 కోట్లు కేటాయించాలని కేంద్రం ఆదేశించింది.రెండు మాసాల్లో  ఈ నిధులను  జమ చేయాలని  కోరింది. అనుమతుల్లేని ప్రాజెక్టులన్నీ  ఆరు మాసాల్లోపుగా అనుమతులు తెచ్చుకోవాలని ఆదేశించింది. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తైనా  వాటిని నిలిపివేయాలి.

కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరి పై 71 ప్రాజెక్టులను రెండు బోర్డుల పరిధుల్లోకి చేర్చింది. బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను చేర్చాలనే ప్రతిపాదనను మొదటి నుండి  తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఆయా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయకుండానే బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావడంపై తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.  తాజాగా కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ  బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావడంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయశాఖ నిపుణులతో చర్చిస్తోంది.

click me!