గోదావరికి భారీ వరద: భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

By narsimha lode  |  First Published Jul 13, 2022, 1:02 PM IST

గోదావరికి వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి 53 అడగులకు చేరింది.  దీంతో మూడో విడత ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 


భద్రాచలం: Godavari కి వరద పోటెత్తింది. దీంతో Bhadrachalam వద్ద గోదావరి నది 53 అడుగులకు చేరింది. సాయంత్రానికి వరద మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎగువ నుండి భారీగా వరద వస్తున్నందున భద్రాచలం వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ అనుదీప్ లు భద్రాచలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో మైపు భారీ వరద నేపథ్యంలో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను సిద్దం చేశారు.

భద్రాచలం జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రెండు రోజుల క్రితం భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అయితే వరద తగ్గుముఖం పట్టడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు..  ఇవాళ ఉదయం నుండి వరద పెరిగింది. భద్రాచలం వద్ద 53 అడుగులకు గోదావరి చేరడంతో  మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు

Latest Videos

undefined

గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి 45 అడుగులు దాటితేనే భద్రాచలం వద్ద ఇబ్బందికర పరిస్థితులుంటాయి. అయితే సాయంత్రానికి 66 అడుగులకు వరద ప్రవాహం చేరితే ఇబ్బందికర పరిస్తితులు ఉండే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆహారం అందించనున్నారు.  తెలంగాణలోని 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమై అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. 

ధవళేశ్వరం వద్ద గోదావరి మరింత ఉగ్రరూపంలో ప్రవహిస్తుంది. 15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ధవళేశ్వరం వద్ద గోదావరి 17 లక్షల క్యూసెక్కులకు చేరితే మూడో ప్రమద హెచ్చరిక జారీ చేయనున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున గోదావరికి మరింత వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

also read:ఆదిలాబాద్ లో వరద ఉధృతి: కొట్టుకుపోయిన మత్తడి వాగు గేట్లు

గోదావరి నదిపై ఎగువ ప్రాంతంలో నిర్మించిన  కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడగడ్డ బ్యారేజీలోకి భారీగా గోదావరి వరద వచ్చి చేరుతుంది.  12,10,600 క్యూసెక్కుల నీరు వస్తుంది. అంతే స్థాయిలో నీటిని  దిగువకు విడుదల చేస్తున్నారు. సరస్వతి బ్యారేజీకి  7,78,000 ఇన్ ఫ్లో వస్తుంది. అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం దిగువన ఏపీ రాష్ట్రంలో  గోదావరితో పాటు ఉపనదులు ఉప్పొంగుతున్నాయి. లంక గ్రామాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. చింతూరు పరిసరాల్లోని సుమారు 300 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  భద్రాచలం చత్తీస్ ఘడ్ మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి. 

click me!