
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పెస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు.. స్పైస్ జెట్ విమానంలో పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. దీంతో విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. పైలట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేయడంతో.. ప్రయాణికులు, ఎయిర్‌పోర్టు సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
వివరాలు.. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో బుధవారం రాత్రి ల్యాండింగ్‌కు ముందు సమస్య తలెత్తింది. గోవా నుంచి రాత్రి 9.55 గంటలకు బయలుదేరిన విమానం.. రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే విమానం గాల్లో ఉన్న సమయంలోనే.. పైలట్ కాక్‌పిట్‌లో పొగను గమనించాడు. విమానంలో పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే పైలట్ వెంటనే.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC)ని అప్రమత్తం చేశాడు. వారు ఎయిర్‌పోర్టులోని గ్రౌండ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో.. అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఆ విమానంలో 86 మంది ప్రయాణికులు ఉన్నారని.. ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నారని సమాచారం. ఓ మహిళా ప్రయాణీకురాలు అస్వస్థతకు గురికాగా.. ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆమె పరిస్థితి బాగానే ఉందని సమాచారం. అయితే విమానం ల్యాండ్ అయిన తర్వాత కొద్దిసేపు వానలోనే నిలబడాల్సి వచ్చిందని, విమాన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు
ఇక, స్పైజ్ జెట్ విమానం. అత్యవసర ల్యాండింగ్ కారణంగా తొమ్మిది విమానాలు ఇతర నగరాలకు మళ్లించబడ్డాయి. అందులో ఆరు దేశీయ విమానాలు, రెండు అంతర్జాతీయ విమానాలు, ఒక కార్గో విమానం ఉంది.