ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య... ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి సత్యవతి రాథోడ్

Arun Kumar P   | Asianet News
Published : Sep 10, 2021, 01:13 PM ISTUpdated : Sep 10, 2021, 01:18 PM IST
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య... ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి సత్యవతి రాథోడ్

సారాంశం

రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనపై రాష్ట్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాాథోడ్ సీరియస్ అయ్యారు. 

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్ అయ్యారు. వెంటనే ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని... నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. 

ఈ అమానుషం గురించి తెలిసిన వెంటనే మంత్రి సత్యవతి పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమీషనర్ దివ్య దేవరాజన్ కు ఫోన్ చేసారు. ఈ ఘటనపై ఆరా తీసిన మంత్రికి బాదిత కుటుంబ దీన పరిస్థితి గురించి తెలిసింది. దీంతో తక్షణ సాయం కింద 50వేల రూపాయలు అందించాలని అధికారులను మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు.

నిందితుడు పల్లంకొండ రాజుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని... బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా వుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కాబట్టి కాలనీవాసులు సంయమనంతో వుండాలని ఆమె సూచించారు. మహిళల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం షీటీమ్స్, భరోసా కేంద్రాలు, సఖీ కేంద్రాలను ఏర్పాటుచేసినా అక్కడక్కడ ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని అన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రుల మనస్థైర్యాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలు జరక్కుండా మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

read more  సూర్యాపేట జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం: ప్రేమించలేదని యువతి గొంతు కోసిన యువకుడు

హైదరాబాదులోని సైదాబాదులో గల సింగరేణి కాలనీలో గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలిక రాజు అనే వ్యక్తి ఇంట్లో అర్థరాత్రి శవమై కనిపించింది. పాపపై రాజు లైంగిక దాడి చేసి, ఆ తర్వాత ఆమెను చంపేసి, శవాన్ని బొంతలో చుట్టి ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికను చంపిన తర్వాత రాజు పరారైనట్లు తెలుస్తోంది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటనపై స్థానికులు తీవ్రమైన ఆగ్రహానికి గురై ఆందోళనకు దిగారు. రాజును తమకు అప్పగించాలని పోలీసులపై దాడి చేశారు. పాప తల్లిదండ్రులు నల్లగొండ జిల్లా నుంచి వలస వచ్చి సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నారు. 

స్థానికులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడిచేశారు దాంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. 300 మంది పోలీసులతో కాలనీలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ చౌహాన్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

నిందితుడు రాజూ నాయక్ నల్లగొండ జిల్లా చందంపేట మండలానికి చెందినవాడు. అతను హైదరాబాదులో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సంఘటనను నిరసిస్తూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. రాజు నాయక్ పోలీసు కస్టడీలోనే ఉన్నాడని, అతన్ని తమకు అప్పగించాలని స్థానికులు అంటున్నారు. రాజూ నాయక్ బాధిత కుటుంబం ఇంటి పక్కనే నివాసం ఉంటున్నాడు.

PREV
click me!

Recommended Stories

Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం