‘‘ఆడపిల్లని అనేగా ఇలా చేస్తున్నారు’’

First Published Jun 19, 2018, 9:59 AM IST
Highlights

 లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి

బుద్ధిగా చదువుకోమని కాలేజీలో ఫీజు కట్టి.. హాస్టల్ లో చేర్పించడమే ఆ  తండ్రి చేసిన నేరమైంది. చదువుకుంటే తన కూతురు భవిష్యత్తు బంగారంలా ఉంటుందని భావించాడు ఆ తండ్రి. కానీ..కూతురుకు మాత్రం చదువే కష్టమైపోయింది. హాస్టల్ లో చేర్పించారనే కోపంతో లేఖ రాసి ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లిపోయింది. దీంతో.. ఆ తండ్రి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్‌నగర్‌లోని పద్మాలయ అంబేడ్కర్‌ నగర్‌ బస్తీకి చెందిన అప్పారావు... అపోలో ఆసుపత్రిలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు కుమార్తె ఎస్‌.దీపిక(18) ఇంటర్మీడియట్‌ పూర్తి చేయగా మేడ్చల్‌ సమీపంలోని గురుకుల కళాశాలలో డిగ్రీలో చేర్పించేందుకు సీటు పొందారు. 

ఆమెకు ఇంటిపట్టున ఉండి చదువుకోవాలని కోరిక.  హాస్టల్ లో ఉండాల్సి వస్తుందని మూడు రోజులుగా దీపిక మదనపడుతోంది. సోమవారం తల్లిదండ్రులుపెద్దమ్మగుడికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న దీపిక  ‘ఇంట్లో నా ఇష్టానికి విలువలేదు.. ఆడపిల్లననే కారణంతోనే ఇలా చేస్తున్నారు.. నాకు ఇష్టం లేకుండా హాస్టల్‌లో వేయాలని అనుకుంటున్నారు.. సారీ డాడీ.. నిన్ననే నేను ఫాదర్స్‌ డే కోసం కేక్‌ తెచ్చి తినిపించాను.. కానీ ఆ సంతోషం ఇప్పుడు నాలో లేదు.. నేను వెళ్లిపోతున్నాను.. ఇక్కడ ఉండలేను’  అని లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. 

ఇంటికి వెళ్లిన తల్లిదండ్రులు ఇది గుర్తించి జూబ్లీహిల్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా తండ్రి అప్పారావు మాట్లాడుతూ... తన కుమార్తెను మంచిగా చదివించాలనే కోరికతో ఎంతో కష్టపడి గురుకుల కళాశాలలో సీటు సంపాదించామన్నారు. తన కుమార్తెకు అక్కడ ఉండి చదవడం ఇష్టం లేని విషయం తమకు తెలియదని, తెలిస్తే తమ ఆమె మాటకే విలువనిచ్చే వారమని బోరున విలపించారు.

click me!