
వైద్యుల నిర్లక్ష్యం ఓ యువతి ప్రాణం మీదకు వచ్చింది. చికిత్స పేరుతో చేతినే తీసేశారు. వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా జరిగిన ఈ సంఘటన నగరంలోని నాచారం ప్రసాద్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
జ్వరం రావడంతో మౌలాలికి చెందిన వైష్ణవి సమీపంలోని నాచారంలోని ప్రసాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. అక్కడ వైష్ణవికి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ప్లేట్ లెట్స్ తగ్గాయని గుర్తించారు. చికిత్సలో భాగంగా రక్తం ఎక్కించారు. అయితే అది కాస్త ఇన్ ఫెక్షన్ కు దారి తీసింది.
దీంతో వైష్ణవిని అక్కడి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ మరిన్ని పరీక్షలు చేసి ఇన్ ఫెక్షన్ శరీరం మొత్తానికి పాకిందని గుర్తించి రక్తం ఎక్కించిన ఆమె కుడి చెయ్యిని తొలగించారు.
ఇప్పుడు శరీరం మొత్తానికి ఇన్ ఫెక్షన్ చేరేలా ఉందని మరో కాలు, చెయ్యి కూడా తీసేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని డాక్టర్లు తెలిపారు.
దీంతో వైష్ణవి తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. ప్రసాద్ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ కూతురుకి ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు. డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.