వావ్.. హైదరాబాద్ లక్క గాజులకు జీఐ ట్యాగ్

By Sairam Indur  |  First Published Mar 3, 2024, 9:16 AM IST

హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందిన లక్క గాజులకు మరింత గౌరవం లభించింది. ఈ గాజులకు జీఐ ట్యాగ్ మంజూరైంది (GI tag for Hyderabad lakka bangles). హైదరాబాద్ హలీంతో పాటు వరంగల్ దురీస్, నిర్మల్ టాయ్స్, కరీంనగర్ ఫిలిగ్రీ, పోచంపల్లి ఇకాత్ తదితర ఉత్పత్తులకు కూడా గతంలో ఈ గుర్తింపు లభించింది.


హైదరాబాద్ లో తయారయ్యే ప్రసిద్ధ లక్క గాజులకు గొప్ప గౌరవం దక్కింది. ఆ గాజులకు జీఐ (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌) గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని చెన్నై జీఐ రిజిస్ట్రీ శనివారం వెల్లడించింది. దీంతో తెలంగాణకు ఇప్పటి వరకు వచ్చిన జీఐ ట్యాగ్ ల సంఖ్య 17కు చేరింది. ఇప్పటికే హైదరాబాద్ హలీమ్ కు జీఐ ట్యాగ్‌ దక్కిన విషయం తెలిసిందే. 

హైదరాబాద్ పాతబస్తీ, చార్మినార్ ప్రాంతాల్లో లక్క గాజులను తయారు చేసి అమ్ముతుంటారు. ఈ గాజుల తయారీలో 6 వేల కుటుంబాలు నిమగ్నమై ఉన్నాయి. వీటిని చార్మినార్ లడబజార్ లాక్ గాజులు అని కూడా అంటారు. వీటిని లక్కతో తయారు చేస్తారు కాబట్టి తెలుగులో లక్క గాజులని పిలుస్తారు. 

Latest Videos

ఈ గాజులు స్థానికంగానే కాదు.. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా ప్రసిద్ధి గాంచాయి. వీటి తయారీ చాలా క్లిష్టంగా ఉంది. చాలా నైపుణ్యంతో వీటిని తయారు చేయాల్సి ఉంటుంది. కొలిమిపై రెసిన్ ను కరిగించి లక్క తీస్తారు. దానిని రౌండ్ గా తయారు చేసి, దానిపై రాళ్ల, అద్దాలు, పూసలు, స్పటికాలు వంటివి నైపుణ్యంతో అద్దుతారు. మొగలుల కాలం నుంచి వీటి తయారీ ప్రారంభమైంది. కాల క్రమంలో వీటిలో ఎన్నో మార్పులు వచ్చాయి. 

ఇంతటి ప్రాముఖ్యత కలిగిన లక్క గాజులకు జీఐ ట్యాగ్ ఇవ్వాలని హైదరాబాద్ కు చెందిన క్రిసెంట్ హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2022 జూన్ లో దరఖాస్తు చేసింది. దీని కోసం తెలంగాణ ఇండస్ట్రీస్, కామర్స్ డిపార్ట్ మెంట్ సాయం అందించింది. సుమారు 18 నెలల పరిశీలన అనంతరం చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ లక్క గాజులకు జీఐ ట్యాక్ ను ప్రకటించింది. 

ఈ గుర్తింపు వల్ల లక్క గాజులకు మరింత ప్రత్యేక గౌరవం దక్కుతుంది. మార్కెటింగ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ గాజుల తయారీపై ఆదారపడ్డ కుటుంబాలకు ఇది ఒక ప్రోత్సాహకంగా మారుతుంది. కాగా.. హైదరాబాద్ హలీంతో పాటు వరంగల్ దురీస్, నిర్మల్ టాయ్స్, కరీంనగర్ ఫిలిగ్రీ, పోచంపల్లి ఇకాత్ తదితర ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్రంలో జీఐ ట్యాగ్ దక్కాయి.

click me!