జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై వీధి కుక్క దాడి.. కాలు, చెవిపై గాయాలు..

Published : Mar 07, 2023, 10:37 AM IST
జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై వీధి కుక్క దాడి.. కాలు, చెవిపై గాయాలు..

సారాంశం

హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. తాజాగా నగరంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై వీధి కుక్క దాడి చేసింది.

హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. అంబర్‌పేటలో ఇటీవల వీధి కుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో నగరవాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వీధి కుక్కల బెడదను నియంత్రించడానికి జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టిన ఫలితం కనిపించడం లేదు. పలుచోట్ల వీధి కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నగరంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై వీధి కుక్క దాడి చేసింది.

వివరాలు.. రామేశ్వరి జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు స్వీపర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వీపర్‌గా పనిచేస్తున్న రామేశ్వరిని ఖైరతాబా‌ద్‌లోని ఆనంద్ నగర్‌ ప్రాంతానికి కేటాయించారు. సోమవారం తెల్లవారుజామున రోడ్లు ఊడ్చే పనికి వెళ్తుండగా రామేశ్వరిపై కుక్క దాడి చేసింది. తొలుత కుక్క ఆమె కాలును కొరికింది. దీంతో రామేశ్వరి కిందపడిపోయినప్పుడు.. ఆమె చెవి వెనక పట్టుకుని ఈడ్చుకెళ్లే యత్నం చేసింది. దీంతో రామేశ్వరి తీవ్ర భయాందోళనకు గురై కేకలు పెట్టింది. తోటి కార్మికులు, స్థానికులు వెంటనే స్పందించి కుక్కను తరిమివేశారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రామేశ్వరిని తక్షణ వైద్య సహాయం కోసం ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు యాంటీ రేబిస్ షాట్ ఇచ్చి.. చికిత్స అందించారు. కుక్క దాడిలో గాయపడిన రామేశ్వరికి వారం రోజులు సెలవు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక, కుక్క కాటుకు గురైన రామేశ్వరిని ఆదుకోవాలని కార్మిక  సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంపీ వెటర్నరీ బృందాలు.. ఆ ప్రాంతానికి చేరుకుని కుక్కను బంధించాయి. తమ ప్రాంతంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?