అంబర్‌పేట్‌లో కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మరణించిన ఘటనపై స్పందించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ. కుక్కలు ఎక్కువగా వున్న ప్రాంతాలపై దృష్టి పెడతామన్న ఆమె.. ఇప్పటికే 4 లక్షలకు పైగా కుక్కలను స్టెరిలైజ్ చేశామని తెలిపారు.
అంబర్‌పేట్ తరహా ఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటామన్నారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ. ఆరోజు జీహెచ్ఎంసీ పరిధిలోని జోనల్ కమీషనర్లు, అధికారులతో ఆమె అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ఆకలితోనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయని వ్యాఖ్యానించారు. కుక్కలు ఎక్కువగా వున్న ప్రాంతాలపై దృష్టి పెడతామని మేయర్ స్పష్టం చేశారు. ఇప్పటికే 4 లక్షలకు పైగా కుక్కలను స్టెరిలైజ్ చేశామని విజయలక్ష్మీ వెల్లడించారు.
అంతకుముందు అంబర్‌పేట్ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. నగరంలో వీధి కుక్కలు, కోతుల సమస్యపై 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని ఆయన అన్నారు. దీనిపై తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ, వెటర్నరీ అధికారులతో చర్చిస్తామని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
ALso REad: వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి బలి.. అధికార యంత్రాంగంపై విమర్శలు, జీహెచ్ఎంసీ అత్యవసర సమావేశం
కాగా.. హైదరాబాద్ అంబర్‌పేట్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి ప్రదీప్ ఆదివారం తన తండ్రితో కలిసి ఆయన పనిచేసే ప్రాంతానికి వెళ్లాడు. అయితే తండ్రి పనిచేసుకుంటూ వుండటంతో అక్కడికి సమీపంలోనే వున్న అక్క దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో కానీ మూడు వీధి కుక్కలు.. చిన్నారిని చుట్టుముట్టాయి. అవి అరుస్తూ, దాడి చేస్తుండటంతో బాలుడు భయాందోళనలకుగురయ్యాడు. తప్పించుకునేందుకు ఆ చిన్నారి ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. ఆ కుక్కలు చిన్నారిపై దాడి చేస్తూ నోట కరచుకుని దాడి చేశాయి.
ప్రదీప్ తండ్రి అక్కడికి వచ్చేలోపే చిన్నారిని ఆ కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. దీంతో బాబుని దగ్గరిలోని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లుగా చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పిల్లాడిపై కుక్కల దాడికి సంబంధించిన దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు మంత్రి కేటీఆర్ కూడా ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీధి కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.