జీహెచ్ఎంసీ సమావేశం ఇవాళ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ సమావేశం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారంనాడు ప్రారంభమైంది. ఈ సమావేశం ప్రారంభానికి ముందే జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్పోరేటర్లు ఆందోళనకు దిగారు . ఎస్ఆర్‌డీపీ రెండో దశ ఏమైందని కాంగ్రెస్ కార్పోరేటర్లు ప్ల కార్డులు ప్రదర్శించి నిరసనకు దిగారు. జీహెచ్ఎంసీ ప్రజల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. మరో వైపు శానిటేషన్ కార్మికుల ఆందోళన విషయమై జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ కార్పోరేటర్లు నిరసనకు దిగారు. రోడ్లను ఊడ్చి బీజేపీ కార్పోరేటర్లకు నిరసనకు దిగారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని బీజేపీ కార్పోరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇక సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని బీజేపీ కార్పోరేటర్లు కోరారు.ఈ విషయమై పట్టుబడ్డారు. తీర్మానం చేయాలని కోరారు. ఈ విషయమై బీజేపీ కార్పోరేటర్లు సమావేశంలో ఆందోళన చేశారు. బీజేపీ కార్పోరేటర్ల తీరుపై మేయర్ విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు.తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లలో సమాధానం చెప్పినా కూడ బీజేపీ కార్పోరేటర్లకు అర్ధం కావడం లేదన్నారు. ఇక నుండి తమిళంలో సమాధానం చెప్పాలని కమిషనర్ ను కోరుతానని మేయర్ గద్వాల విజయలక్ష్మి సెటైర్లు వేశారు.
బీఆర్ఎస్, బీజేపీ కార్పోరేటర్లు పోటా పోటీగా మాట్లాడారు. ఈ సమయంలో ఎవరేమీ మాట్లాడుతున్నారో కూడ అర్ధం కాని పరిస్థితి నెలకొంది. మార్షల్స్ ను పిలిపించాల్సి వస్తుందని మేయర్ వ్యాఖ్యానించారు.ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ సమావేశానికి జర్నలిస్టులకు మేయర్ అనుమతిని నిరాకరించారు. ప్రతి మూడు మాసాలకు ఒక్కసారి జరిగే సమావేశానికి జర్నలిస్టులను అనుమతిస్తారు. కానీ , ఇవాళ జరిగిన సమావేశానికి జర్నలిస్టులను అనుమతించలేదు. సమావేశ మందిరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన తమ పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.
ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ సమావేశం ముగిసిన తర్వాత సమావేశ మందిరం బయటే కాంగ్రెస్, బీజేపీ కార్పోరేటర్లు నిరసనకు దిగారు. రోజంతా సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.