మేయర్ పీఠం టీఆర్ఎస్ దే: కేసీఆర్ స్వయంకృతాపరాధమే...

By telugu teamFirst Published Dec 4, 2020, 3:36 PM IST
Highlights

జిహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకునే అవకాశమే ఉంది. అయితే, టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పే దిశలోనే హైదరాాబాదు ఫలితాలు వస్తున్నాయి. ఇది కేసీఆర్ స్వయంకృతాపరాధమే.

హైదరాబాద్: జిహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను టీఆర్ఎస్ దక్కించుకునే అవకాశాలున్నాయి. అయితే, ఫలితాలు ఏకపక్షంగా లేకపోవడమే టీఆర్ఎస్ ను కలిచి వేసే విషయం. బిజెపి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాటిన సత్తా మాత్రం టీఆర్ఎస్ కు భవిష్యత్తు ప్రమాదం గురించిన సంకేతాలు మాత్రం ఇచ్చినట్లే.

మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి టీఆర్ఎస్ కు 65 స్థానాలు సరిపోతాయి. దాదాపుగా 70 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ కు 37 మంది ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు. అందువల్ల మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకోవడానికి టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు అవసరం ఉండకపోవచ్చు. 

అయితే, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి టీఆర్ఎస్ కు బలమైన సవాల్ విసిరినట్లే భావించవచ్చు. బిజెపి వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి క్రమ క్రమంగా పుంజుకునే అవకాశం ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని ఆషామాషిగా తీసుకోకూడదనే హెచ్చరికలు టీఆర్ఎస్ కు వెళ్లాయి. దాంతోనే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డింది. అయితే, గత ఎన్నికల్లో కన్నా తక్కువ స్థానాలను దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.

పరిస్థితి చూస్తే తెలంగాణలో టీఆర్ఎస్ ఏకఛత్రాధిపత్యానికి గండి పడే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు బిజెపిని ఆదరించరనేది అపోహ మాత్రమేనని తేలిపోయే పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇందులో బిజెపి బలం కన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంకృతాపరాధమే ఎక్కువగా ఉంది. 

కేసీఆర్ తాను చెప్పిందే వేదందా, తాను నడిచిందే రాచబాటగా వ్యవహరించారు. తెలంగాణలోని యువతలో, మేధావివర్గంలో, ఇతర చదువుకున్న మధ్యతరగతి వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి పేరుకుపోయిందనే విషయాన్ని ఆయన గుర్తించడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తూ వచ్చారు. కొంత వరకు చెప్పాలంటే, ఆ వర్గాలకు చెందిన కొంత మంది బిజెపిని ఆహ్వానించలేక అసంతృప్తితోనే టీఆర్ఎస్ కు ఓటేశారు. ఇదే పద్దతిలో కేసీఆర్ తీరు ఉంటే ఆ మాత్రం మద్దతును కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. 

click me!