కిషన్ రెడ్డితో కత్తి కార్తిక భేటీ: ఒకటి రెండు రోజుల్లో బిజెపిలోకి....

By telugu teamFirst Published Nov 21, 2020, 5:18 PM IST
Highlights

ప్రముఖ యాంకర్ కత్తి కార్తిక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. జహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కార్తిక ఒకటి రెండు రోజుల్లో బిజెపిలో చేరే అవకాశం ఉంది.

హైదరాబాద్: యాంకర్ కత్తి కార్తిక శనివారంనాడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బిజెపి నేత జి. కిషన్ రెడ్డిని కలిశారు. ఆమె ఒకటి రెండు రోజుల్లో బిజెపిలో చేరే అవకాశం ఉంది. దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల్లో కార్తిక పోటీ చేశారు. కానీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆమెకు డిపాజిట్ కూడా దక్కలేదు.

జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆమె బిజెపిలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆమె కిషన్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. కత్తి కార్తిక టీఆర్ఎస్ నేత, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు సన్నిహిత బంధువు. వరుసకు ఆమె పద్మారావుకు మనవరాలు అవుతారు. తనకు పద్మారావు ఆదర్శమని గతంలో ఆమె ఓ సందర్భంలో చెప్పారు. 

జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి ఇతర పార్టీల నాయకులకు వల విసురుతోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్న బిజెపి ప్రదానంగా కాంగ్రెసు నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించే వ్యూహాన్ని అనుసరిస్తోంది. 

కాంగ్రెసు నేత, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డి ఇప్పటికే బిజెపిలో చేరారు శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, నియోజకవర్గం ఇంచార్జీ రవి కుమార్ యాదవ్ కూడా బిజేపిలో చేరారు. మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ బిజెపిలో చేరే అవకాశం ఉంది. 

కాగా, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ను బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, బిజెపి ఓబీసీ సెల్ చైర్మన్ లక్ష్మణ్ సమావేశమయ్యారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. గత కొంత కాలంగా స్వామి గౌడ్ టీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.

click me!