జిహెచ్ఎంసీ ఎన్నికలు: చక్రం తిప్పుతున్న భూపేంద్ర యాదవ్, కొండాతో భేటీ?

By telugu teamFirst Published Nov 20, 2020, 7:12 PM IST
Highlights

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ చక్రం తిప్పడం ప్రారంభించారు భూపేంద్ర యాదవ్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని కాంగ్రెసు ముఖ్య నేతలకు బిజెపి వల వేస్తున్నట్లు కనిపిస్తోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వ్యూహరచనకు, దాని అమలుకు బిజెపి అధిష్టానం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ నను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఆయన అప్పుడే చక్రం తిప్పడం ప్రారంభించారు. 

మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డిని ఆయన కలిసినట్లు తెలుస్తోంది. కొండా విశ్వేశ్వర రెడ్డిని తమ పార్టీలోకి లాగేందుకు గత కొద్ది రోజులుగా బిజెపి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బిజెపిలో చేరుతానని కొండా విశ్వేశ్వర రెడ్డి హామీ ఇవ్వనట్లు తెలుస్తోంది. 

మాజీ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణను తెలంగాణ బిజెిప అధ్యక్షుడు బండి సంజయ్ కలిసినట్లు కలిశారు. తమ పార్టీలోకి రావాలని సర్వేను బండి సంజయ్ కోరారు. సర్వే సత్యనారాయణ కాంగ్రెసు పార్టీ తీరు పట్ల చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు.

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేయడానికి బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దుబ్బాక జోష్ తో హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ స్థితిలో బిజెపి నేతలు పలువురు నేతలను కలిసే అవకాశం ఉంది.

మరో కాంగ్రెసు నాయకుడిని కూడా బిజెపి నేతలు కలిసే అవకాశం ఉంది. ఓ టీఆర్ఎస్ నేతతోనూ బిజెపి నాయకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో బండి సంజయ్ ప్రకటనతో తలెత్తిన విభేదాలను పరిష్కరించడంలో భూపేంద్ర యాదవ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ జనసేనను జిహెచ్ఎంసీ ఎన్నికల బరి నుంచి తప్పించడానికి ఆయన చొరవ ప్రదర్శించినట్లు చెబుతున్నారు. 

click me!