వైఎస్ మీద వ్యాఖ్యలు: కూకట్ పల్లిలో వైసిపి ధర్నా, రఘునందన్ రావు వివరణ

By telugu teamFirst Published Nov 23, 2020, 1:56 PM IST
Highlights

వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై బిజెపి ఎమ్మెల్యే రఘనందన్ రావు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కూకట్ పల్లిలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తన వ్యాఖ్యలపై రఘునందన్ రావు వివరణ ఇచ్చారు.

హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిపై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. హైదరాబాదులోని కూకట్ పల్లిలో వారు ఆందోళనకు దిగారు. వైఎస్ మరణంపై రఘునంనద్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. 

ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలపై రఘునందన్ రావు వివరణ ఇచ్చారు. తాను వైఎస్ రాజశేఖర రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.  వైఎస్సార్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, తన వ్యాఖ్యల్లో ఏ విధమైన దురుద్దేశం లేదని రఘునందన్ రావు చెప్పారు. అభిమానులు నొచ్చుకుంటే క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ చేసిన సేవలు ఎంతో గొప్పవని, వాటిపై తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ వీడియోను ఆయన విడుదల చేశారు.

వెనకటికి ఒకరు పావురాల గుట్టలో పావురమై పోయాడని రఘునందన్ రావు వ్యాఖ్యానించినట్లు చెబుతున్న వీడియో వైరల్ గా మారింది. ఆయితే ఆయన వైఎస్ పేరును ప్రస్తావించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా అదే అవుతుందనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. 

జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ కు, బిజెపికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు పార్టీల నాయకులు తీవ్రంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ డిెసంబర్ 1వ తేదీన జరగనుంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 4వ తేదీన జరుగుతుంది. జిహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 డివిజన్లలో విజయం సాధించింది.

దుబ్బాక శానససభ ఉప ఎన్నికల విజయంతో ఊపు మీదున్న బిజెపి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేయాలని చూస్తోంది. టీఆర్ఎస్ ను ఎదుర్కునేందుకు సిద్ధపడింది. కాంగ్రెసు వెనక్కి వెళ్లి బిజెపి ముందుకు వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా కాంగ్రెసు ఊసు కూడా ఎత్తకుండా బిజెపిపైనే విరుచుకుపడుతున్నారు.

click me!