జిహెచ్ఎంసీ ఎన్నికలు: రాజాసింగ్ ఆడియో టేపులపై బిజెపి నేత లక్ష్మీనారాయణ స్పందన

By telugu teamFirst Published Nov 23, 2020, 1:26 PM IST
Highlights

ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసినట్లుగా ప్రచారం జరుగుతున్న ఆడియో టేపులపై స్పష్టత రావాల్సి ఉందని బిజెిప నేత యెండల లక్ష్మీనారాయణ చెప్పారు. పార్టీలో గ్రూపులు లేవని స్పష్టం చేశారు.

హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయనవిగా చెబుతున్న ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తనకు అన్యాయం చేశాడంటూ రాజాసింగ్ చెప్పినట్లు ఉన్న ఆడియో వైరల్ అవుతోంది. 

రాజాసింగ్ విడుదల ఆడియోగా ప్రచారం జరుగుతున్న టేపులపై స్పష్టత రావాల్సి ఉందని బిజెపి నాయకుడు యెండల లక్ష్మీనారాయణ చెప్పారు.  రాజాసింగ్ నివాసంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుందని ఆయన అన్నారు. రెండు రోజుల్లో రాజాసింగ్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తారని ఆయన అన్నారు. 

తమ పార్టీలో గ్రూపులు లేవని ఆయన చెప్పారు పార్టీలో ఆధిపత్య పోరు కూడా లేదని అన్నారు. గెలిచేవారికే పార్టీ టికెట్లు ఇస్తుందని ఆయన చెప్పారు. ఓ ప్రముఖ టీవీ చానెల్ తో ఆయన మాట్లాడారు. రాజాసింగ్ ను కలవపడానికి ఆయన విసానికి యెండల లక్ష్మినారాయణ వచ్చారు. 

రాజాసింగ్ మేనల్లుడు రోహిత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. రోహిత్ సింగ్ ఆత్మహత్య గురించి తెలుసుకున్న వెంటనే రాజాసింగ్ తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

ఇదిలావుంటే, తమ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద తాను ఆరోపణలు చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్ తీరుతో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నష్టం జరుగుతోందని, ఆయనను తక్షణమే పార్టీ అధ్యక్షుడిగా తొలగించాలని తాను డిమాండ్ చేసినట్లుగా ట్వీట్ రూపొందించి కొందరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

దానిపై తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రాజాసింగ్ తెలిపారు. పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రత్యర్థులు చేస్తున్న కుట్రగా దాన్ని ఆయన అభివర్ణించారు. రాజాసింగ్ వాయిస్ ఉన్నట్లు భావిస్తున్న ఆడియో ఒకటి తీవ్ర కలకలం సృష్టించింది. 

బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మీద రాజాసింగ్ ఆగ్రహంగా ఉన్నట్లు, బండి సంజయ్ తనకు అన్యాయం చేసినట్లు ఆడియోలో ఉంది. తన అనుచరులకు గన్ ఫౌండ్రీ, బేగంబాజరు సీట్లు అడిగితే ఇవ్వలేదని, 2018లో తన విజయానికి కృషి చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వలేకపోయానని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆడియోలో ఉంది. 

తన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, మూడో రోజుల తర్వాత జాతీయ నాయకత్వానికి లేఖ రాస్తానని, బిజెపి రాష్ట్ర నేతల తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని రాజాసింగ్ చెప్పినట్లు ఆడియోలో ఉంది. 

తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా బండి సంజయ్ తీరు సరిగా లేదని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఫొటో ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యలేట్ చేస్తున్నారని ఆయన తాజాగా ట్వీట్ చేశారు. 

click me!