జిహెచ్ఎంసి ఎన్నికలు... అసదుద్దీన్ అద్భుతదీపంపైనే కేసీఆర్ ఆశలన్నీ: విజయశాంతి సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : Nov 17, 2020, 11:52 AM IST
జిహెచ్ఎంసి ఎన్నికలు... అసదుద్దీన్ అద్భుతదీపంపైనే కేసీఆర్ ఆశలన్నీ: విజయశాంతి సంచలనం

సారాంశం

అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగిన సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారం దుబ్బాక ఓటమి తర్వాత కూడా తగ్గలేదని... అందువల్ల గ్రేటర్ ఓటర్లు కూడా ఆయనకు తగిన బుద్ది చెప్పడానికి సిద్దంగా వున్నారని విజయశాంతి అన్నారు. సోషల్ మీడియా వేదికన టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు విజయశాంతి.

వ్యక్తిగత ఫేస్ బుక్ పేజీలో విజయశాంతి చేసిన పోస్ట్ యధావిధిగా: 

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారు దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జిహెచ్ఎంసి ఎన్నికల్లో వంద సీట్లకు పైగా గెలుస్తామని వాస్తవానికి దూరమైన ప్రకటనలు చేస్తూ.. ముఖ్యమంత్రి గారు ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అల్లావుద్దీన్ అద్భుతదీపం మాదిరిగా, అసదుద్దీన్ అద్భుతదీపంతో  జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏమైనా అద్భుతాలు జరుగుతాయని సీఎం దొరగారు ఆశలు పెంచుకున్నారని అర్థమవుతోంది.  

చాలా ఏళ్ల పాటు గెలిచిన నియోజకవర్గాల్లో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా... విద్వేష ప్రసంగాలతో మాయమాటలు చెప్పి పాతబస్తీ ఓటర్లను మోసం చేయడంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ  అందె వేసిన చేయిగా మారిపోయారు.  ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే ఓటర్లను మాయ చేసి.. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే ఫార్ముల గురించి కెసిఆర్ గారు ఎమ్ఐఎమ్ అధినేతతో మంతనాలు జరిపారన్న ప్రచారం జరుగుతోంది.

గత ఎన్నికల్లో కెసిఆర్ గారి హామీలపై భ్రమలు పెంచుకున్న గ్రేటర్ వోటర్లు ఈసారి మాత్రం టిఆర్ఎస్ అభ్యర్ధులకు తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధమవుతున్నారు. ఎంఐఎం తో కలిసి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేయాలనుకున్న సీఎం దొరగారు  వేసుకున్న లెక్కలన్నీ ఈసారి తారుమారు కాబోతున్నాయని ఈ మధ్య కాలంలో ఓటర్ల నాడిని చూస్తే అనిపిస్తోంది. ఏది ఏమైనా జిహెచ్ఎంసి మేయరు పదవి ఈ పర్యాయం "మేసేవారికి" కాక "మేయరు..." అనే వారికి దక్కాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నది వాస్తవం.
విజయశాంతి
 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఒక్కొక్కరు ఇంత మందు తాగుతున్నారా..! ఇందుకోసం ఇంత ఖర్చు చేస్తున్నారా..!!
Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు