
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం (GHMC council meeting) శనివారం నిర్వహించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి (gadwal vijayalakshmi) అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలి తొలిసారిగా ప్రత్యక్షంగా భేటీ కావడం ఇదే తొలిసారి. అయితే ఈ సమావేశం రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్ కార్పొరేట్ల ప్రసంగిస్తుడడంతో బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిధులు ఇస్తున్నారంటూ మాట్లాడొద్దని బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బీజేపీ కార్పొరేటర్లకు మైక్ ఇవ్వడంపై టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మండిప్డడ్డారు.
ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో జై తెలంగాణ అంటూ టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, భారత్ మాతాకీ జై అని బీజేపీ కార్పొరేటర్లు పోటాపోటీ నినాదాలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశాన్ని త్వరగానే ముగించారు. అనంతరం బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చ కోసం పట్టుబడితే మేయర్ మధ్యలోనే సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జర్నలిస్టుల ధర్నా..
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులను గ్యాలరీలోకి అనుమతించలేదు. దీంతో జర్నలిస్టులు మేయర్ విజయలక్ష్మి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాలరీల్లోకి జర్నలిస్టులకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కౌన్సిల్ హాల్ బయట ధర్నాకు దిగారు. హాల్ బయట కూర్చొని మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మీడియాను గ్యాలరీలోకి అనుమతించకపోవడంపై బీజేపీ, టీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం నెలకొంది.
కరోనా నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ మొదటి జనరల్ బాడీ మీటింగ్ ను వర్చువల్ విధానంలో నిర్వహించారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో కొంత మార్పులు ఉండటంతో.. పాలక మండలి ఏర్పడిన తర్వాత ప్రత్యక్షంగా జరిగిన తొలి సమావేశంగా నేటి భేటీ నిలిచింది. అయితే అది కాస్తా రసాభాసాగా మారింది.