దంచికొడుతున్న వాన.. అవసరమైతేనే బయటకు రండి , హైదరాబాదీలకు జీహెచ్ఎంసీ హెచ్చరిక

By Siva Kodati  |  First Published Jul 20, 2023, 5:26 PM IST

హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్‌ బలగాలను మోహరించారు. 


తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానల కారణంగా రాష్ట్రంలో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. నదుల్లో ప్రవాహం పెరుగుతోంది. ఎగువ రాష్ట్రాల్లోనూ వరద ఉదృతి పెరుగుతూ వుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలోనూ కుంభవృష్టి కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతోంది. 

ఈ నేపథ్యంలో నగరవాసులకు జీహెచ్ఎంసీ కీలక హెచ్చరిక చేసింది. భారీ వర్షం కురిసే అవకాశం ఉందని .. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో డీఆర్‌ఎఫ్‌ బృందాలను జీహెచ్‌ఎంసీ మోహరించింది. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో 24 గంటలూ సిబ్బంది అందుబాటులో వుంటారని తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ టీమ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొంది. నాలా పనులు పూర్తి కాని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. శిథిలావస్థలో వున్న భవనాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది. 

Latest Videos

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు:జఫర్ ఘడ్ లో 19.2 సెం.మీ. వర్షపాతం, ఈ నెల 24 వరకు వానలు

కాగా.. రెండు  రోజులుగా  తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  వర్షాలు కురుస్తున్నాయి. జనగామ జిల్లాలోని జఫర్‌ఘడ్ లో  19.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ నెల 24 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీంతో  ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని  అధికారులు సూచించారు. యాదాద్రి భువనగిరి  జిల్లా రాజాపేట మండలం పాముకుంటలో 17 సెంమీ. మెదక్ జిల్లా వెల్తుర్థిలో 15 సెం.మీ వర్షపాతం నమోదైంది. 

ఉత్తర తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఎగువన కురుస్తున్న వర్షాలతో  గోదావరి పరివాహక ప్రాంతాల్లో జలకళ సంతరించుకుంది. గోదావరి పరివాహ ప్రాంతంలో  బ్యారేజీలు, ప్రాజెక్టులకు  వరద నీరు పోటెత్తుతుంది. కడెం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఒక గేటు ద్వారా  2,142 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా  రాష్ట్ర వ్యాప్తంగా  సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 


 

click me!