ఈసారి ఒకే రోజున గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకేరోజు రావడంతో హైదరాబాద్ పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఇరు మతాలకు చెందిన 300 మందితో శాంతి కమిటీని ఏర్పాటు చేసి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సమావేశం నిర్వహించారు.
ఈసారి ఒకే రోజున గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకేరోజు రావడంతో హైదరాబాద్ పోలీసులు ఉలిక్కిపడ్డారు. సెప్టెంబర్ 28న హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం నిర్వహించనున్నారు. అదే రోజున మిలాద్ ఉన్ నబీ రావడంతో నగరంలో ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తారు. రెండు మతాల పండుగలు ఒకే రోజున రావడంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం వుందని పోలీసులు భావిస్తున్నారు.
దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఇరు మతాలకు చెందిన 300 మందితో శాంతి కమిటీని ఏర్పాటు చేసి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సమావేశం నిర్వహించారు. రెండు పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూస్తామన్నారు. అయితే మిలాద్ ఉన్ నబీ ర్యాలీని వాయిదా వేసేందుకు శాంతి కమిటీ సభ్యులు అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రెండు పండుగలు ఒకేరోజున రావడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కొందరు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడాలని ప్రజలకు ఒవైసీ సూచించారు. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అసదుద్దీన్ కోరారు.