గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రేపు ఆమె కాంగ్రెస్ లో చేరనున్నారు.
మహబూబ్ నగర్: బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత బుధవారంనాడు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీఆర్ఎస్ నాయకత్వానికి పంపారు. రేపు కాంగ్రెస్ పార్టీలో సరిత చేరనున్నారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా బీఆర్ఎస్ నాయకత్వానికి పంపినట్టుగా సరిత తెలిపారు.
గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో గత కొంత కాలంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు మధ్య గ్యాప్ కొనసాగుతుంది. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ ను వీడాలని సరిత నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారు. సరిత దంపతులతో జూపల్లి కృష్ణారావు చర్చలు జరిపారు. కాంగ్రెస్ లో చేరేందుకు సరిత దంపతులు అంగీకరించారు. దీంతో రేపు సరిత దంపతులు కాంగ్రెస్ లో చేరుతారు.
Also read:విడతలవారీగా తెలంగాణలో బస్సు యాత్రలు, సభలు: కాంగ్రెస్ సీనియర్ల కీలక నిర్ణయం
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారంగా ఈ నెల 20 కొల్లాపూర్ లో సభను నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.ఈ సభలో ప్రియాంకగాంధీ పాల్గొనాల్సి ఉంది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ సభను వాయిదా వేశారు.ఈ నెల 30వ తేదీన ఈ సభను నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తుంది.అయితే ముందుగా నిర్ణయించుకున్నట్టుగానే సరిత దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
గద్వాల అసెంబ్లీ స్థానం నుండి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో డీకే అరుణ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పరిణామాల్లో డీకే అరుణ బీజేపీలో చేరారు. ప్రస్తుతం గద్వాలలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు లేరు. దీంతో వచ్చే ఎన్నికల్లో గద్వాల నుండి కాంగ్రెస్ పార్టీ తరపున సరిత పోటీ చేసే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు చెందిన పలు పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. అయితే పార్టీ చేరికల విషయమై పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే మార్గదర్శనం చేస్తున్నారు.