
అతడో ఎలక్ట్రీషియన్. కొన్ని నెలల కిందట ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ తో సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది. దీంతో వారిద్దరూ స్నేహితులు అయ్యారు. కొన్నాళ్ల తరువాత ఆ యువకుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆ యువతికి చెప్పగా.. దానికి అంగీకరించలేదు. తాజాగా మళ్లీ ఆమెతో పెళ్లి ప్రతిపాదన పెట్టారు. కానీ ఆమె తిరస్కరించడంతో ఆగ్రహంతో అతడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో జరిగింది.
గద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేటకు చెందిన ఎలక్ట్రీషియన్ 32 ఏళ్ల రాజుకు ఆరు నెలల క్రితం సోషల్ మీడియాలో హైదరాబాద్ కు చెందిన 23 ఏళ్ల ప్రైవేట్ టీచర్ తో పరిచయం అయ్యింది. ఈ పరిచయం వారి మధ్య స్నేహానికి దారి తీసింది. అయితే ఆమెపై ఇష్టంతో కొన్ని నెలల కిందట రాజు ఆ యువతికి ప్రపోజ్ చేశాడు. కానీ ఆమె దానిని తిరస్కరించింది.
అయితే రాజు మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉద్యోగం వెతకాలనే కారణంతో హైదరాబాద్ కు గురువారం వచ్చాడు. కూకట్ పల్లి సమీపంలో ఉన్న ఆ యువతి టీచర్ గా పని చేస్తున్న స్కూల్ కు దగ్గరలో ఉన్న ఓ హాస్టల్ దిగాడు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో రాజు ఆ యువతిని కలిశాడు. పెళ్లి చేసుకుందామని ఆ యువతితో మళ్లీ ప్రతిపాదన పెట్టాడు. కానీ మళ్లీ ఆమె దానిని తిరస్కరించింది.
ఈ తిరస్కరణను జీర్ణించుకోలేని రాజు స్థానిక దుకాణంలో కత్తిని కొనుగోలు చేశాడు. తరువాత బాధితురాలి స్కూల్ సమీపంలో ఆమె కోసం వేచి ఉన్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆ యువతి స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరింది. కూకట్ పల్లిలోని విజయ నగర్ కాలనీ సమీపంలో రాజు ఆమెపై కత్తితో దాడి చేశాడు. గొంతు కూడా కోయడానికి ప్రయత్నించడంతో స్థానికులు జోక్యం చేసుకుని అడ్డుకున్నారు. ఈ క్రమంలో రాజు ముఖంపై రెండు చిన్నపాటి గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే బాధితురాలిని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటన అనంతరం నిందితుడు ఆత్మహత్యకు యత్నించినట్టు పోలీసులు తెలిపారు. దీంతో అతడికి కూడా గాయాలు అయ్యాయి. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఇన్ స్పెక్టర్ తెలిపారు.