
హైదరాబాద్ : గురువారం మధ్యాహ్నం కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు తెలుగు యువతీ, యువకులు దుర్మరణం పాలయ్యారు. కుకునూరు తాలూకా బన్నికొప్ప దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వీరంతా కారులో కొప్పళ నుంచి గదగ మీదుగా గోవావైపు వెళుతున్నారు. ఆ సమయంలో వారి కారు వంతెనను బలంగా ఢీకొట్టింది. కారు చాలా స్పీడ్ గా ఉండడంతో వంతెనకు ఢీ కొట్టిన ధాటికి కారు నుజ్జు నుజ్జయింది. దీంతో ఈ కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో షణ్ముఖ్(28) హైదరాబాద్ మియాపూర్ కు చెందిన యువకుడు ఉన్నాడు.
మరొకరు బీఎఫ్ఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని కే వెన్నెల వర్ధిని (18) ఆమె హైదరాబాదులోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ వర్సిటీలో చదువుతోంది. వీరిద్దరితోపాటు కారులో 25 ఏళ్ల ఓ యువకుడు, 23 ఏళ్ల మరో యువతీ ఉన్నారు. వీరిద్దరూ ఎవరన్నది ఇంకా తెలియ రాలేదు. వెన్నెలవర్ధిని స్వస్థలం గోదావరిఖనిలోని రమేష్ నగర్ కాలనీ. ఇక షణ్ముఖ్ తల్లిదండ్రులు కొద్ది కాలం క్రితం బాపట్ల జిల్లా కారంచేడు నుంచి హైదరాబాదుకు వచ్చి ఉంటున్నారు. షణ్ముఖ్ తండ్రి శ్రీరాములు కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు.
ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ ఆఫీస్ పెడతా.. బీఆర్ఎస్ అధిష్టానంతో పోరుకు పొంగులేటి రెడీ
షణ్ముఖ కూడా ఇటీవల ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లాలని ప్లాన్ వేశాడు. దీనికోసం మియాపూర్ లో ఓ ట్రావెల్స్ కారు అద్దెకు తీసుకుని బయలుదేరారు. అంతలోనే వారి ప్రయాణం విషాదాంతం అయింది.