
హైదరాబాద్: నలుగురు హైదరబాదీ యువకులు దర్గా దర్శనానికి వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఆదివారం మద్యాహ్నం బీదర్ జిల్లాలోని ఓ ప్రముఖ దర్గా వద్దగల చెరువులో స్నానానికి దిగి నలుగురు యువకులు గళ్లంతయ్యారు.
వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని బీదర్ జిల్లా గొడివాడలో ప్రముఖ దర్గా వుంది. ముస్లింలతో పాటు హిందువులు కూడా ఈ దర్గాను ఎంతో పవిత్రంగా భావించి దర్శించుకుంటుంటారు. తెలంగాణ నుండి కూడా చాలామంది ఈ దర్గాను దర్శించుకుంటుంటారు.
ఆదివారం ఉదయం హైదరాబాద్ పాతబస్తీలోని సలీంబాబా నగర్ బస్తీకి చెందిన జునైద్ ఖాన్(21), అతడి సోదరుడు ఫహద్ ఖాన్(16)తో పాటు స్నేహితులు జునైద్(16), హైదర్ ఖాన్(16) కారులో బీదర్ జిల్లా గొడివాడికి బయలుదేరారు. మద్యాహ్నానికి దర్గావద్దకు చేరుకున్నారు. దర్గా దర్శనానికి ముందు సమీపంలోని చెరువులో నలుగురు స్నానానికి దిగారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువు పూర్తిగా నిండింది. దీంతో చెరువులోకి దిగిన హైదర్ మునిగిపోతుండగా అతడిని కాపాడే క్రమంలో మిగతా ముగ్గురు కూడా నీటమునిగారు.
read more హైదరాబాద్: గూగుల్ సిగ్నల్ వద్ద బైక్‌పై దూసుకెళ్లిన కారు ... యువతి మృతి
చెరువులో నీరు ఎక్కువగా ఉండటం... యువకుల్లో ఎవ్వరికీ ఈత రాకపోవడంతో నీటమునిగి మృతిచెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుస్తులు, గుర్తింపు కార్డుల ఆధారంగా యువకులు హైదరాబాద్ కు చెందినవారిగా గుర్తించారు. గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ నలుగురి మృతితో సలీంబాబా నగర్‌లో విషాదం నెలకొంది.