కేసీఆర్ మీద అసభ్య పదజాలంతో వీడియో వైరల్: నలుగురి అరెస్టు

By telugu teamFirst Published May 7, 2021, 8:25 AM IST
Highlights

ఈటెల రాజేందర్ ఆస్తులపై విచారణకు ఆదేశించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ను అసభ్య పదజాలంతో దూషిస్తూ వీడియో రూపొందించి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

సూర్యాపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును తీవ్రమైన పదజాలంతో దూషించి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తితో పాటు మరో ముగ్గురిని సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీసులు గురువారంనాడు అరెస్టు చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆస్తులపై విచారణకు ఆదేశించిన నేపథ్యంలో వారు ఆ చర్యలకు పాల్పడ్డారు. 

అందుకు సంబంధించి మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. పెన్ పహాడ్ మండలం న్యూ బంజారాహిల్స్ కాలనీకి చెందిన ధరావత్ శ్రీను ఈ నెల 2వ తేదీన కేసీఆర్ తో పాటు విద్యుత్తు శాఖ మంత్రి మంత్రి జగదీష్ రెడ్డిని, తదితరులను అసభ్య పదజాలంతో దూషిస్తూ ఈ వీడియోను రూపొందించాడు. 

దాన్ని వాట్సప్ ద్వారా అదే మండలం జల్మల్ కుంట తండాకు చెందిన ధరావత్ శ్రీను అలియాస్ లంబు శ్రీనుకు పంపించాడు. అతను ఆ వీడియోను చీదెళ్లకు చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎం. సీతారామయ్యకు పంపించాడు. సీతారామయ్య ఆ వీడియోను ఇతర గ్రూపుల్లో షేర్ చేశాడు. 

అదే వీడియోను చీదెళ్లకు చెందిన కె. ఉపేందర్, భక్తాళాపూరానికి చెందిన నెమ్మాది ఉపేందర్ లు మరిన్ని వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశఆరు. దానిపై ధర్మాపురం సర్పంచ్ నగేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ధరావత్ శ్రీను అలియాస్ లంబు శ్రీను పరారీలో ఉన్నాడు. మిగిలిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సూర్యాపేట రూరల్ సిఐ విఠల్ రెడ్డి తెలిపారు. 

click me!