బీజేపీలో ఉన్నవాళ్లంతా రాక్షసులే: మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి

First Published Jun 26, 2018, 12:42 PM IST
Highlights

మోడీపై మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్:  సామాజిక మాధ్యమాల్లో  కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌పై దాడి చేయడాన్ని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్. జైపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సుష్మాస్వరాజ్  పట్ల  ఆ పార్టీకి చెందిన నేతలే వివక్ష చూపుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి మంగళవారం నాడు హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.సామాజిక మాధ్యమాలపై నియంత్రణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రిమోడీకి  వ్యతిరేకంగా సుష్మా స్వరాజ్  ఉన్న కారణంగా ఆమెపై సామాజిక మాధ్యమాల్లో దాడి చేటుకొందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

సుష్మాస్వరాజ్ కూడ ఆర్ఎస్ఎస్ కుటుంబం నుండి వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. లంకలో పుట్టినవాళ్లంతా రాక్షసులేనని, అదే తరహలో బీజేపీలో ఉన్నవారంతా కూడ రాక్షసులేనని ఆయన అభిప్రాయపడ్డారు. 

కేంద్రంలోని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్ళుగా సామాన్యుల కోసం ఏం చేయలేదని ఆయన  విమర్శించారు. పన్నుల భారంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని  ఆయన గుర్తు చేశారు.  

ముందస్తు ఎన్నికలు తాము సిద్దంగానే ఉన్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ లో విబేధాలు సహజమన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం నేతలంతా కలిసి పోతారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవన్నారు. ఎన్నికల సమయంలో తమకు ఇబ్బందులు ఉండవని జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ ఏ స్కీమ్ ప్రవేశపెట్టినా విఫలమౌతోందని ఆయన చెప్పారు. పేదల గురించి  బీజేపీ నేతలకు తెలియదన్నారు. బీజేపీలో చదువుకొన్నవారేరీ అంటూ జైపాల్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలను సంధించారు. బీజేపీపై చేసిన ఘాటు వ్యాఖ్యలను ఆ తర్వాత  జైపాల్ రెడ్డి సవరించుకొన్నారు. తాను సామెత రూపంలో ఈ విమర్శలు వర్తించవని జైపాల్ రెడ్డి ప్రకటించారు.
 


 

click me!