టీఆర్ఎస్ లోకి మరో బీజేపీ నేత.. సీఎం కేసీఆర్ తో మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ భేటీ..

By SumaBala Bukka  |  First Published Oct 24, 2022, 6:49 AM IST

బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ కేసీఆర్ తో భేటీ అయ్యారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నానని.. టీఆర్ఎస్ లో చేరతానని చెప్పారు. 


హైదరాబాద్ : బీజేపీ నేత మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేనేతరంగ అభివృద్ధికి కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చేనేతపై జిఎస్టి వేయడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బిజెపి చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన తాను.. బిజెపి చేస్తున్నఈ నిర్వాకాన్ని చూస్తూ భరించలేక బిజెపికి రాజీనామా చేస్తున్నానని సీఎం కేసీఆర్ తో చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని, టిఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు రాపోలు చెప్పారు. భారత రాష్ట్ర సమితి ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. 

ఇదిలా ఉండగా,   అక్టోబర్ 22న టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలంటూ ప్రధాని మోడీకి స్వదస్తూరితో పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోస్ట్ కార్డు తీసుకుని తాను చెప్పదలచుకున్న విషయాన్ని స్వయంగా తన స్వహస్తాలతో మోడీకి రాసి పంపారు కేటీఆర్. రాష్ట్రంలో చేనేత కార్మికులతో పాటు ఈ రంగాన్ని ఆదుకునేందుకు స్నేహితులు ముందుకు రావాలని.. అందరూ కలిసి ప్రధానికి పోస్టుకార్డు రాయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 

Latest Videos

కల్లు గీత కార్మికులపై కేటీఆర్ వరాల జల్లు.. మోపెడ్‌లు ఇస్తామన్న మంత్రి

అంతకు ముందు మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో శుక్రవారం మన్నెగూడలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి జీవనోపాధిని అందిస్తున్నది చేనేత రంగమేనని ఆయన తెలిపారు. కెసిఆర్ చిన్నప్పుడు పద్మశాలి కుటుంబం ఇంట్లోనే ఉంటూ చదువుకున్నారని తెలిపారు మంత్రి కేటీఆర్.

2002లో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కోసం సీఎం కేసీఆర్ స్వయంగా విరాళాలు సేకరించారని కేటీఆర్ పేర్కొన్నారు.  ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున రెండు వేల కార్మికుల ఆత్మహత్యలను నివారించేందుకు రూ.50లక్షల నిధులను  ఇచ్చారని  కేటీఆర్ గుర్తు చేశారు. తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రూ. 70 కోట్లుగా ఉన్న చేనేత బడ్జెట్ను ఏకంగా  రూ.1200 కోట్లకు పెంచారని తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్లలో చేనేత శాఖ ఇప్పటివరకు రూ.5,752 కోట్లని కేటీఆర్ చెప్పారు. ప్రతి ఏటా కేటాయింపులు పెంచుకుంటూ వస్తున్నామని చేనేత కళాకారుల డిజైన్లను ఎవరైనా కాపీ కొడితే కఠిన చర్యలు తీసుకుని లోపల వేస్తామని మంత్రి హెచ్చరించారు. 

click me!