కీలక పరిణామం: ఈటలరాజేందర్‌తో భేటీ కానున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి

By narsimha lodeFirst Published May 6, 2021, 4:43 PM IST
Highlights

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ‌తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి  గురువారం నాడు సమావేశం కానున్నారు. 
 

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ‌తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి  గురువారం నాడు సమావేశం కానున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇది కీలకమైన పరిణామమని చెప్పవచ్చు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలనే ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడ గుడ్ బై చెప్పారు. పార్టీ పెట్టాలా, వేరే పార్టీలో చేరాలా అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన గత మాసంలో మీడియాకు చెప్పారు. 

కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఈటల రాజేందర్ భవిష్యత్తు కార్యాచరణను ఇంకా ప్రకటించలేదు. అయితే  అంతకుముందే ఉద్యమకారులు, ఉద్యమ సంస్థలతో చర్చలు జరపుతామని ఈటల రాజేందర్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. కొండా విశ్వేశ్వర రెడ్డి, తదితరులతో కలిసి ఈటల రాజేందర్ పార్టీ పెట్టే దిశగా ఆలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు కూాడా చెలరేగాయి. 

మెదక్ జిల్లాలోని మాసాయిపేట, హకీంపేటలో అసైన్డ్  భూములను ఆక్రమించుకొన్నారనే ఆరోపణలతో మంత్రివర్గం నుండి  ఈటల రాజేందర్ ను  కేసీఆర్ తప్పించారు.  మరోవైపు దేవరయంజాల్  శ్రీసీతారామస్వామి దేవాలయ భూములను ఈటల రాజేందర్ ఆయన అనుచరులు భూములను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారని గుర్తించారు.

ఏసీబీ, విజిలెన్స్ సంస్థలు, ఐఎఎస్ కమిటీలు ఈ నిర్మాణాలపై విచారణ నిర్వహిస్తున్నాయి.   మరోవైపు ఈటల రాజేందర్ కు మద్దతుగా నిలుస్తున్న నేతలపై  టీఆర్ఎస్ సర్కార్ కన్నేసింది. ఈటలతో వెన్నంటి ఉన్న ఓ టీఆర్ఎస్ నేత సింగిల్ విండోలో అవకతవకలకు పాల్పడినట్టుగా నోటీసులు జారీ చేశారు. 

click me!