Munugodu Bypoll 2022 : టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..!

By SumaBala BukkaFirst Published Sep 21, 2022, 9:10 AM IST
Highlights

మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే చివరికి ఖరారు చేయనున్నట్లు సమాచారం. అసమ్మతి సెగల నేపథ్యంలో  ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాకే  పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు. 

హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేసినట్లు సమాచారం.  అయితే, ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాకే  పార్టీ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిసింది. షెడ్యూల్ వెలువడేలోగా పార్టీ పరంగా మునుగోడు నియోజకవర్గంలో జరిగే ప్రచార కార్యక్రమాలు అన్నింటిలోనూ కూసుకుంట్లకే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆయనే పార్టీ అభ్యర్థి అనే సంకేతాలను కేడర్ కు కెసిఆర్ పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి జగదీష్ రెడ్డి, టిఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి  రవీందర్ రావు,  ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య తో పాటు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సైతం పాల్గొనడం గమనార్హం. మునుగోడు నియోజకవర్గంలో  గ్రామాల వారీగా జరుగుతున్న పార్టీ కార్యకర్తల సమావేశాల నివేదికలను విశ్లేషిస్తూ రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధుతో పాటు ఇటీవల ప్రకటించిన గిరిజన బంధు, గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశాలను  ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆదేశించారు. ఆత్మీయ వనభోజనాల ద్వారా మండలాల వారీగా నియమితులైన పార్టీ ఇన్చార్జీలు కేడర్ కు దగ్గర కావాలని సూచించారు. చేరికల ద్వారా పార్టీ బలోపేతం కావాలని, పాత, కొత్త కేడర్ ను సమన్వయం చేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. 

కాగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు సీటు ఖాళీ అయ్యింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలూ ఇక్కడ పాగా వేయాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి మళ్లీ అదే స్థానం నుంచి .. బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. ఇక కాంగ్రెస్ మాత్రం మునుగోడు తమ కంచుకోట అని ఈ సారి కూడా ఈ స్తానం తమదేనని ఘంటాపథంగా చెబుతోంది.

ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ తరపున మునుగోడు బరిలో మాజి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దిగనున్నారు. సిఎం కేసిఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఆగస్ట్ 12న ఖరారు చేశారు. ఆగస్ట్ 20న సంస్దాన్ నారాయణ పూర్ లో జరుగనున్న ప్రజా దీవెన సభలో సిఎం కేసిఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం గురించి ప్రకటించాల్సి ఉండింది. అయితే అసమ్మతి సెగలు వెల్లువెత్తాయి.

కేసీఆర్ తో మంత్రి జగదీష్ రెడ్డి భేటీ: మునుగోడుపై చర్చ, అభ్యర్ధిని ప్రకటించే చాన్స్

మునుగోడు ఉప ఎన్నికకు సిద్దమవుతున్న టీఆర్ఎస్‌‌లో అసమ్మతి రాగం చల్లారడం లేదు. అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకముందే అసమ్మతి  తారాస్థాయికి చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఖాయమైనట్టుగా వార్తల నేపథ్యంలో.. ఆయనకు వ్యతిరేకంగా పలువురు నేతలు అసమ్మతి వినిపిస్తున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. 

నియోజకవర్గంలో కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ నేతలతో జగదీష్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం వారిని ప్రగతి భవన్‌‌కు తీసుకెళ్లారు. అయితే ప్రగతి భవన్‌ నుంచి బయటకు వచ్చిన నేతలు.. ఎవరికి టికెట్ ఇచ్చిన అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. దీంతో పరిస్థితి చక్కబడిందని అంతా భావించారు. కానీ రెండు రోజులకే సీన్ మారిపోయింది. మళ్లీ మొదటికొచ్చింది. 

కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు కార్యకలాపాలను ముమ్మరం చేశారు. చౌటుప్పల్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం సమావేశమైన అసమ్మతి నేతలు.. ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించవద్దని టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని అభ్యర్థిస్తూ తీర్మానం కూడా చేశారు. ప్రభాకర్ రెడ్డికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అతనికి తప్ప మిగిలిన ఎవరికైనా టికెట్ ఇచ్చిన గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని వారు చెప్పారు. ప్రభాకర్ రెడ్డి స్థానిక నేతలకు అందుబాటులో ఉండటం లేదని వారు ఆరోపించారు. 

కాగా, సెప్టెంబర్ 20, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో మంత్రి జగదీష్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత మునుగోడులో పోటీ చేసే అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

click me!