బీఆర్ఎస్ కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం: బీజేపీకి కోమటిరెడ్డి రాజీనామా

By narsimha lode  |  First Published Oct 25, 2023, 11:46 AM IST


బీజేపీకి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఇవాళ రాజీనామా చేశారు. ఎల్లుండి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు.


హైదరాబాద్: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారంనాడు బీజేపీకి రాజీనామా చేశారు.  రాజీనామా లేఖను  బీజేపీ కార్యాలయానికి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంపారు. రాజీనామా లేఖలో  పార్టీ పరిస్థితిని  ఆయన పేర్కొన్నారు.

ఏడాదిన్నర క్రితం వరకు తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా  బీజేపీ ఎదిగిందన్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో  బీజేపీ  కొంత డీలా పడిందని  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు  మార్పును కోరుకుంటున్నారని  రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
నాడు బీజేపీలో చేరినా..నేడు కాంగ్రెస్ లో చేరినా తన లక్ష్యం మాత్రం ఒక్కటేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను అంతం చేయడమే తన ఉద్దేశ్యమని  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరించారు.

Latest Videos

undefined

బీఆర్ఎస్ పై క్షేత్రస్థాయిలో  తీవ్ర వ్యతిరేకత ఉందని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయమని  ప్రజలు అభిప్రాయపడుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు.అందుకే తాను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా  వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టుగా  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. గత ఏడాది అక్టోబర్ నెలాఖరున మునుగోడు అసెంబ్లీకి  జరిగిన ఉప ఎన్నికల్లో  బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి అధికార బీఆర్ఎస్ ను ఓడించినంత పని చేసినట్టుగా రాజగోపాల్ రెడ్డి  గుర్తు చేశారు.ఈ ఎన్నికల్లో  తాను  స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైనట్టుగా  రాజగోపాల్ రెడ్డి వివరించారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో   100 మంది ఎమ్మెల్యేలు మరో వంద మంది ఇతర సీనియర్  నేతలను ప్రచారంలోకి బీఆర్ఎస్  దింపిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అవినీతిలో మునిగిన కేసీఆర్ సర్కారుపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న తెలంగాణ ప్రజల కోరిక నెరవేరకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయని ఆయన  చెప్పారు.

also read:నేడు అనుచరులతో భేటీ:ఈ నెల 27న కాంగ్రెస్‌లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

 అధికార మార్పును కోరుకుంటున్న తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తాను కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టుగా  రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బిజెపికి రాజీనామా చేస్తున్నట్టుగా  రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా నాకు నియంతృత్వ కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించిన బిజెపికి ధన్యవాదాలు తెలిపారు. కెసిఆర్ సర్కారుపై యుద్ధం చేయాలని ప్రోత్సహించిన కేంద్ర మంత్రి అమిత్ షాకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. 

2022  ఆగస్టు మాసంలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ కు, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.  గత ఏడాది చివర్లో జరిగిన మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. గత కొంతకాలంగా బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలతో అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి  కాంగ్రెస్ లో చేరాలని  నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు  బీజేపీకి  రాజీనామా చేస్తున్నట్టుగా  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ప్రకటించారు.ఎల్లుండి రాహుల్ గాంధీ , మల్లికార్జున ఖర్గే సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు.

click me!