తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి: రేసులో జానారెడ్డి టాప్, రేవంత్ కు దెబ్బేనా?

By narsimha lodeFirst Published Jul 29, 2020, 12:00 PM IST
Highlights

తెలంగాణ పీసీసీ చీఫ్  పదవికి మాజీ మంత్రి జానారెడ్డి పేరు కూడ రేసులో అగ్రభాగాన నిలిచింది. జానారెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకపోతే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఈ పదవి పేరును పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది


హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్  పదవికి మాజీ మంత్రి జానారెడ్డి పేరు కూడ రేసులో అగ్రభాగాన నిలిచింది. జానారెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకపోతే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఈ పదవి పేరును పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే రేవంత్ రెడ్డి పేరును కూడ పార్టీ నాయకత్వం సీరియస్ గానే పరిశీలిస్తోంది. అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇస్తే పార్టీలోని ఇతర సీనియర్లు తీవ్రంగా  వ్యతిరేకించే అవకాశం లేకపోలేదు.

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన పదవి కాలం పూర్తైంది. ఎన్నికలను పురస్కరించుకొని ఆయనను పార్టీ నాయకత్వం కొనసాగించింది.

గత ఏడాదిలోనే తన స్థానంలో మరొకరిని నియమించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన పార్టీ నాయకత్వానికి లేఖ రాశాడు. అయితే పీసీసీ చీఫ్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై పార్టీ నాయకత్వంమల్లగుల్లాలు పడుతోంది.

పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి పేరును పార్టీ నాయకత్వం సీరియస్ గా పరిశీలిస్తోంది. అయితే పార్టీని నమ్ముకొన్న వారికి కాకుండా నిన్నగాక మొన్న పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు ఇవ్వొద్దని కొందరు నేతలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారని ప్రచారం సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఈ విషయమై బహిరంగంగానే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరో వైపు బీసీ సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ పదవిని అప్పగించాలని హనుమంతరావు డిమాండ్ చేస్తున్నారు. ఈ పదవికి తాను కూడ పోటీలో ఉన్నట్టుగా చెప్పారు.

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడ పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ నాయకత్వంతో లాబీయింగ్ చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య,జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు లపేర్లు కూడ పార్టీ నాయకత్వం పరిశీలనలో ఉందనే ప్రచారం సాగుతోంది.

రేవంత్ రెడ్డికి బదులుగా సీనియర్ నాయకుడు జానారెడ్డికి ఈ పదవిని అప్పగిస్తే ప్రయోజనం కలుగుతోందనే అభిప్రాయం కూడ పార్టీ వర్గాల్లో ఉంది. జానారెడ్డి ఈ పదవిని తీసుకొనేందుకు సుముఖంగా లేకపోతే ఈ పదవిని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కట్టబెట్టే అవకాశాలను కొట్టిపారేయలేమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సౌమ్యుడిగా పేరున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు పార్టీలోని అన్నివర్గాలను కలుపుకొనే అవకాశం ఉంటుందని మరికొందరు నేతలు కూడ చెబుతున్నారు. శ్రీధర్ బాబుకు పార్టీ పగ్గాలు ఇస్తే అభ్యంతరం లేదని చెబుతున్నారు.

ఇక తాను కూడ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల ప్రకటించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకూడదని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ తలనొప్పులను తెచ్చుకోవడం కంటే జానారెడ్డికి ఈ పదవిని అప్పగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.దీంతో జానారెడ్డి పేరు పీసీసీ చీఫ్ రేసులో అగ్రభాగాన ఉందని  పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

తనకు పీసీసీ అధ్యక్ష  పదవిని కట్టబడితే 2023లో  తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆయన పార్టీ అధిష్టానానికి చెప్పినట్టుగా సమాచారం.

ఇదిలా ఉంటే గతంలో కంటే చురుకుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తుండడం ఆశావాహుల్లో ఆందోళనకు కారణమౌతోంది. ఉత్తమ్ ను ఇంకా పార్టీ నాయకత్వం కొనసాగిస్తోందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు కొందరు నేతలు. 


 

click me!