కాంగ్రెస్ పార్టీ సీనియర్ల వ్యవహరంపై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనిల్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ,రేవంత్ రెడ్డిని దెబ్బతీసేందుకు సీనియర్లు ప్రయత్నిస్తున్నారన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బలహీనపర్చే కుట్ర జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే అనిల్ ఆరోపించారు. ఆదివారంనాడు మాజీ ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు.రేవంత్ రెడ్డి పాదయాత్రను దెబ్బతీసేలా సీనియర్లు వ్యవహరిస్తున్నారన్నారు.టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో పార్టీ నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ఎస్ లో చేరిన సమయంలో ఎందుకు సేవ్ కాంగ్రెస్ అనే నినాదాన్ని తీసుకోలేదో చెప్పాలన్నారు.ఇప్పుడు ఏం జరిగిందని సేవ్ కాంగ్రెస్ అంటున్నారో చెప్పాలని అనిల్ ప్రశ్నించారు. 2014 నుండి ఇప్పటివరకు 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ పార్టీని బలోపేతం చేసేందుకు పనిచేస్తారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతారో చెప్పాలన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా సునీల్ కనుగోలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద ఎలాంటి ఆధారాలున్నాయని ఆయన ప్రశ్నించారు.హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పిన విషయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా నమ్ముతారని అనిల్ ప్రశ్నించారు. సీవీ ఆనంద్ బీఆర్ఎస్ ఏజంట్ అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ గురించి హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పిన మాటలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా నమ్మారని అనిల్ ప్రశ్నించారు. ముసుగు వీరులు బయటకు వచ్చారని కాంగ్రెస్ సీనియర్లను ఉద్దేశించి అనిల్ వ్యాఖ్యానించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే పార్టీ సీనియర్లు ఏం చేశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీకి మరిన్ని ఓట్లు వచ్చేవని ఆయన అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై గట్టిగా మాట్లాడుతారని పార్టీ క్యాడర్ అంతా మీ వైపు చూసిందన్నారు. కానీ సీనియర్లు ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మునుగోడులో ఏం జరుగుతుందో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డికి కొందరు నేతలు సమాచారం ఇవ్వలేదా అని కాంగ్రెస్ సీనియర్లను ప్రశ్నించారు.మునుగోడులో ఎంతమంది చిత్తశుద్దితో పనిచేశారు. ఎంత మంది ఇతర పార్టీలతో లోపాయికారీ ఒప్పందాలు చేస్తుకున్నారో తమ వద్ద ఆధారాలున్నాయని అనిల్ చెప్పారు. తన లాంటి నేతలు పనిచేయడం వల్లే మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి 20 వేలకు పైగా ఓట్లు వచ్చాయన్నారు.గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారు ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుందన్నారు. కానీ సీనియర్లపై ఎన్ని కేసులు నమోదయ్యాయో చెప్పాలని అనిల్ ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. తన గెలుపునకు మాత్రం ఆనాడు టీడీపీతో పొత్తు కుదుర్చుకోలేదా అని ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. టీడీపీ నుండి వచ్చినవాళ్లు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయడం లేదా అని ఆయన అడిగారు.