2018 ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రగతి భవన్ వేదికగా కుట్రలు జరిగాయని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు.
హైదరాబాద్:తన హత్యకు కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఈ క్రమంలోనే పక్కాస్కెచ్ ప్రకారమే తనపై మునుగోడులో దాడి చేశారని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.బుధవారంనాడు హైద్రాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. .తనకు రక్తపు బొట్టు కారితే కేసీఆర్ బాధ్యత వహించాలని ఆయన చెప్పారు.కేసీఆర్ ప్రోత్సాహంతోనే బీజేపీపై దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.హుజూరాబాద్ లో అవసరం లేకున్నా గన్ లైసెన్సులు ఇచ్చారని ఈటల రాజేందర్ చెప్పారు.టీఆర్ఎస్ దాడులను చూస్తూ ఊరుకోబోమన్నారు. దెబ్బకు దెబ్బతీస్తామని ఆయన హెచ్చరించారు.
2018 లో తనను ఓడించేందుకు కాంగ్రెస్ అభ్యర్ధికి డబ్బుల పంపిణీ వెనుక ప్రగతి భవన్ కుట్ర ఉందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. తనపై ఈడీ, ఐటీకి కూడా ఫిర్యాదులు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రగతి భవన్ వేదికగానే ఈ కుట్రలు జరిగాయని ఆయన చెప్పారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు , కేసీఆర్ జపం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మంత్రులకు స్వంత ఆలోచన లేదని ఆయన ఎద్దేవా చేశారు.అసెంబ్లీ సమావేశాల్లో తనను అకారణంగా సస్పెండ్ చేశారని ఆయన చెప్పారు.
తనను అనేక రకాలుగా అవమానించేందుకు ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాజేందర్ చెప్పారు. దీని వెనుక సీఎం కేసీఆర్ కుట్రలున్నాయని ఆయన ఆరోపించారు. తనపై విమర్శలు చేస్తున్న నేతల వెనుక కూడ ప్రగతి భవన్ హస్తం ఉందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న తనను కాకుండా ఓటమి పాలైన వారిని ప్రోత్సహిస్తూ తనను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ తీరును ప్రజా క్షేత్రంలో తేల్చుకొంటానని తాను అసెంబ్లీ వేదికగానే ప్రకటించిన విషయాన్ని ఈటల రాజేందర్ గుర్తు చేస్తున్నారు.
also read:ఈటల రాజేందర్‌పై దాడి.. ఎవరి పనో ఆధారాలున్నాయ్ : మంత్రి జగదీశ్ రెడ్డి
డబ్బులతో ఎన్నికల్లో విజయం సాధించాలనే భ్రమలో కేసీఆర్ ఉన్నాడని ఆయన ఆరోపించారు. అత్యంత ఖరీదైన ఎన్నికలు తెలంగాణలో జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రాంతంలో ఎన్నికల సమయంలో కోట్లు ఖర్చు చేశారిన తెలిసి తాము ఆశ్చర్యపోయేవాళ్లమన్నారు. కానీ ఆ సంసృతి తెలంగాణకు కేసీఆర్ తెచ్చారని ఆయన విమర్శించారు.