కేసీఆర్‌ది రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వం: ఈటల

By narsimha lodeFirst Published Jun 14, 2021, 4:31 PM IST
Highlights

కేసీఆర్‌ది రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. 
 

న్యూఢిల్లీ:కేసీఆర్‌ది రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. సోమవారం నాడు న్యూఢిల్లీలో బీజేపీలో చేరిన తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో  తన పాత్ర ఏమిటో ప్రజలకు తెలుసునని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ కోసం అనేక అవమానాలు భరించినట్టుగా ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యానికి కేసీఆర్ ఏనాడూ విలువ ఇవ్వలేదన్నారు. ఒక్కడినే పాలిస్తే బాగుండు అనే మనస్తత్వం కేసీఆర్‌ది అని ఆయన చెప్పారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ దక్కినా కూడ టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను లాక్కొన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

90 సీట్లు గెలిచినా కూడ మూడు మాసాల పాటు కేబినెట్ ను ఏర్పాటు చేయని విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణలో ఒక్క మంత్రైనా ప్రశాంతంగా పనిచేయగలుగుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఇతరుల అభిప్రాయాలను కేసీఆర్ గౌరవించరని ఆయన చెప్పారు. తెలంగాణలో బీజేపీని విస్తరించడంలో నిరంతరం కృషి చేస్తానన్నారు. 

తెలంగాణలో అహంకారపూరితంగా సాగుతున్న కేసీఆర్ పాలనను కూలదోయడమే తన ఎజెండా అని ఈటల చెప్పారు.  పార్టీలో తనకు జరిగిన అవమానాలకు వ్యతిరేకంగా తాను మాట్లాడినట్టుగా ఈటల గుర్తు చేశారు. ఏడాదిన్నర క్రితం గులాబీ పార్టీకి తాము కూడ ఓనర్లమేనని తాను చేసిన ప్రకటనను ఈటల రాజేందర్ మీడియా ప్రతినిధుల వద్ద ప్రస్తావించారు.  తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతోందన్నారు. 
బీజేపీ జాతీయ నాయకత్వం ఆకాంక్షల మేరకు పనిచేస్తానని ఆయన చెప్పారు. 


 

click me!