పోటీకి జైపాల్ రెడ్డి దూరం:డీకే అరుణ సెటైర్లు, తప్పుబట్టిన చిన్నారెడ్డి

By narsimha lodeFirst Published Feb 26, 2019, 8:48 PM IST
Highlights

మహాబూబ్ నగర్ ఎంపీ సీటుపైతెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో ఆసక్తికర చర్చ సాగింది. జైపాల్ రెడ్డిని కేంద్రంగా చేసుకొని మాజీ మంత్రి డీకే అరుణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


హైదరాబాద్: మహాబూబ్ నగర్ ఎంపీ సీటుపైతెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో ఆసక్తికర చర్చ సాగింది. జైపాల్ రెడ్డిని కేంద్రంగా చేసుకొని మాజీ మంత్రి డీకే అరుణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మంగళవారం నాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం హైద్రాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ , ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులపై చర్చించారు. ఆయా జిల్లాల నుండి వచ్చిన అభ్యర్థుల జాబితాపై పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకొన్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ కుంతియా కూడ హాజరయ్యారు.

మహాబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని మాజీ మంత్రి డీకే అరుణను  కుంతియా కోరారు. కానీ, తాను ఎంపీ స్థానం నుండి పోటీ చేసేందుకు సిద్దంగా లేనని డీకే అరుణ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమే తనకు చాలా భారమైందని ఆమె గుర్తు చేశారు.

జైపాల్ రెడ్డి ఉన్నారు....కదా ఆయన పోటీ చేస్తారని డీకే అరుణ చెప్పారు. అంత పెద్ద నాయకుడు ఉన్నా కూడ కొత్త పేర్లు పరిశీలించడం ఎందుకు అని డీకే అరుణ ప్రశ్నించారు. ఈ దఫా జైపాల్ రెడ్డి పోటీ చేయడం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలోనే ప్రకటించారు. 

గ్రౌండ్ బాగున్నప్పుడు వచ్చి పోటీచేసే నేతలు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎందుకు పోటీ చేయరని జైపాల్ రెడ్డిని ఉద్దేశించి డీకే అరుణ ప్రశ్నించారు.నాగర్ కర్నూల్ ఎంపీ స్థానానికి సతీష్ మాదిగ పేరును డీకే అరుణ ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే  ఎంపీ స్థాయి ఉన్న నేతల పేర్లు లేదా పాత వారి పేర్లను ప్రతిపాదించాలని ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కోరారు.

తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వారికి కూడ ఎఐసీసీ కార్యదర్శి పదవులు ఇచ్చారు కదా.. అని డీకే అరుణ ప్రస్తావించారు. అంతేకాదు కొత్తగా వచ్చినవారికి కూడ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

జైపాల్ రెడ్డి గెలిస్తే మల్లిఖార్జున ఖర్గే స్థానంలో ఉండేవారని మాజీ మంత్రి చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. అంత పెద్ద నాయకుడు సమావేశంలో లేని సమయంలో ఆయన గురించి మాట్లాడడం సరైంది కాదని చిన్నారెడ్డి డీకే అరుణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అంత పెద్ద నాయకుడైతే ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని డీకే అరుణ సమావేశంలో అన్నట్టు తెలుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలోనే పెద్ద నాయకులు పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని డీకే ప్రశ్నించారు.

click me!