జగన్ ను ఫాలో అయితే ఈ ఘోరాలు ఉండవు: సంకల్పదీక్షలో కేసీఆర్ పై డీకే అరుణ ఫైర్

By Nagaraju penumalaFirst Published Dec 12, 2019, 5:10 PM IST
Highlights

జగన్ ప్రభుత్వం మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తుంటే కేసీఆర్ మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జగన్ నిర్ణయం శుభపరిణామం అన్న డీకే అరుణ ఆయన్ను కేసీఆర్ ఫాలో అయితే తమకు ఈ తిప్పలు తప్పుతాయన్నారు. 

హైదరాబాద్‌: మద్యం వల్లే తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ బీజేపీ నేత, మాజీమంత్రి డీకే అరుణ ఆరోపించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ, మానస, సమతలపై జరిగిన దారుణాలకు మద్యం మహమ్మారే కారణం అని ఆమె ఆరోపించారు. 

మద్యం అమ్మకాలను నియంత్రించడంతోపాటు దశలు వారీగా మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆమె సంకల్ప దీక్ష చేపట్టారు. రెండు రోజులపాటు ఈ దీక్ష కొనసాగనుంది. 

ఇకపోతే డీకే అరుణ సంకల్ప దీక్షను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ప్రారంభించారు. రాజకీయ కారణాలతో తాము దీక్ష చేపట్టడం లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల వల్ల బ్రాండ్ హైదరాబాద్ కాస్త బ్రాందీ హైదరాబాద్ గా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ రాష్ట్రంగా మార్చేశారంటూ డా.లక్ష్మణ్ ఆరోపించారు. మద్యం షాపులలకు దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.980 కోట్ల ఆదాయం వచ్చిందని స్పష్టం చేశారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాల ద్వారా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయంటూ విరుచుకుపడ్డారు. 

శాంతి భద్రతలకు విఘాతంగ కలుగుతున్నా పట్టించుకోకుండా మద్యం అమ్మకాలను పెంచుకుంటూ పోతున్నారంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను మద్యం మత్తులో ముంచుతున్నారంటూ ధ్వజమెత్తారు. అర్థరాత్రి మద్యం అమ్మకాలకు ప్రోత్సహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మద్యం అమ్మకాలను తగ్గిస్తూ దశల వారీగా పూర్తిగా మధ్యాన్ని నిషేధించాలని డా.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మద్యపాన నిషేధంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామంటూ హెచ్చరించారు. పల్లెల్లో ఉన్న బెల్ట్ షాపులను ధ్వంసం చేయాలంటూ లక్ష్మణ్ పిలుపు ఇచ్చారు. 

తెలంగాణలో మద్యాన్ని నిషేధించే సమయం ఆసన్నమైందని దీక్ష చేపట్టిన డీకే అరుణ అన్నారు. మహిళలు, చిన్నారుల భవిష్యత్‌ గురించి సీఎం కేసీఆర్‌ ఆలోచించాలని లేకపోతే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

తాగొచ్చిన భర్తలను ఇంట్లోకి రానివ్వమని మహిళలు సంకల్పం తీసుకుంటేగానీ వారిలో మార్పురాదన్నారు. మద్యం వల్లే దిశ, మానస, సమతలపై అత్యాచారాలు జరిగాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. 

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్‌ చెప్పిన మాటలను మర్చిపోయారని డీకే అరుణ ధ్వజమెత్తారు. అనేక కుటుంబాలు మద్యం వల్లే ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆరోపించారు. విచ్చలవిడిగా బెల్టు షాపులు పెరిగిపోతున్నా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. 

మద్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విషయం సీఎం కేసీఆర్ కంటికి కనిపించడం లేదా అని నిలదీశారు. పక్కనే ఉన్న జగన్ ప్రభుత్వం మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తుంటే కేసీఆర్ మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.  

జగన్ నిర్ణయం శుభపరిణామం అన్న డీకే అరుణ ఆయన్ను కేసీఆర్ ఫాలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ కలుగుతుందన్నారు. యువత మద్యానికి బానిసలు కావడం అందర్నీ కలచివేస్తోందన్నారు. యువతను పెడదారి పట్టిస్తోన్న పబ్‌లు, క్లబ్‌లను నిషేధించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

ఇకపోతే మాజీమంత్రి డీకే అరుణ చేపట్టిన సంకల్ప దీక్షకు ఆసిఫాబాద్ జిల్లాలో అత్యాచారానికి గురైన సమత కుటుంబ సభ్యులు సైతం హాజరయ్యారు. సమత భర్త, పిల్లలు కుటుంబ సభ్యులు కూడా దీక్షలో పాల్గొనడం విశేషం. 

 

click me!