మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావు నేడు బీజేపీలో చేరనున్నారు.వచ్చే ఎన్నికల్లో ఆయన వేములవాడ నుండి పోటీ చేసే అవకాశం ఉంది.
హైదరాబాద్: మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావు బుధవారంనాడు బీజేపీలో చేరనున్నారు. వికాస్ రావు బీజేపీలో చేరికను పురస్కరించుకొని వేములవాడ నుండి హైద్రాబాద్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో డాక్టర్ వికాస్ రావు బీజేపీలో చేరనున్నారు.
వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏడాదిగా వికాస్ రావు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతిమ పౌండేషన్ ద్వారా ఈ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు.
undefined
వాజ్ పేయ్ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా పనిచేసిన సీహెచ్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు రాజకీయరంగ ప్రవేశం చేయనున్నారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాసాగర్ రావు మహారాష్ట్ర,తమిళనాడు గవర్నర్ గా పనిచేశారు. పదవీకాలం పూర్తైన తర్వాత ఆయన స్వంత రాష్ట్రానికి చేరుకున్నారు. విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావును రాజకీయాల్లోకి తీసుకురావాలని విద్యాసాగర్ రావు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వికాస్ రావు వేములవాడ నుండి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెట్ పల్లి అసెంబ్లీ స్థానం నుండి విద్యాసాగర్ రావు బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి కూడ ఆయన బీజేపీ అభ్యర్థిగా ప్రాతినిథ్యం వహించారు.
వేములవాడ అసెంబ్లీ స్థానం నుండి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేష్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు సోదరుడు సీహెచ్ రాజేశ్వరరావు తనయుడే చెన్నమనేని రమేష్. విద్యాసాగర్ రావు బీజేపీలో ఉంటే, సీహెచ్ రాజేశ్వరరావు సీపీఐలో కీలక నేతగా ఉన్నారు. చెన్నమనేని రాజేశ్వరరావు సీపీఐని వీడి ఆ తర్వాత టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
చెన్నమనేని రాజేశ్వరరావు రాజకీయ వారసుడిగా రమేష్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వేములవాడ నుండి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఈ దఫా చెన్నమనేని రమేష్ కు బీఆర్ఎస్ టిక్కెట్టును నిరాకరించింది. ఈ స్థానం నుండి చలిమెడ లక్ష్మీనరసింహరావుకు బీఆర్ఎస్ టిక్కెట్టును కేటాయించింది.